కమనీయం.. పార్వతీ పరమేశ్వరుల కల్యాణం
గద్వాలటౌన్: ఓం నమః శివాయ.. హర హర.. మహాదేవ శంభోశంకర అన్న నినాదాల నడుమ గురువారం పట్టణంలోని శివాలయాలు మార్మోగాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నల్లకుంట శివాలయంలో పార్వతీ, పరమేశ్వరుల కళ్యాణోత్సవాన్ని పండితులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం మహిళలు దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం స్వామివారికి అభిషేకార్చనలు, రుద్రహోమం తదితర కార్యక్రమాలు చేశారు. ఆలయం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపం వద్దకు స్వామివారి, అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఆలయ నిర్వాహకులు తీసుకొచ్చారు. కళ్యాణ వస్త్రాలను సమర్పించిన అనంతరం భక్తుల సందోహం నడుమ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని పండితుల మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల నడము శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శివరాత్రి విశిష్టతను, పార్వతీ పరమేశ్వరుల కల్యాణ ఘట్టాన్ని భక్తులకు వివరించారు. అదేవిధంగా స్థానిక తెలుగుపేటలోని శివాలయంలో మహా రుద్రభిషేకం, కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. స్థానిక వీరభద్రస్వామి ఆలయంలో, వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో లింగోద్భవ పూజలను జరిపించగా శివనామ కీర్తనలు, భజనలు, భక్తిపాటలతో ఆలయ ప్రాంగణాలు మార్మోగాయి. సత్యసాయి విద్యామందిరంలో విద్యార్థులు భజనలు, భక్తిగీతాలతో హోరెత్తించారు. స్థానిక భీంనగర్‌లోని భీమలింగేశ్వరస్వామి ఆలయం, పలిగుండ్ల ఆంజేనేయస్వామి ఆలయం, నందీశ్వరస్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. స్థానిక ఓం శాంతి పీస్‌పార్కులో 89వ త్రిమూర్తి మహా శివరాత్రి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా సంచాలకులు మహాదేవి జెండాను ఆవిష్కరించి, సందేశం ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని పలు శివాలయాలలో జరిగిన పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలలో పలువురు నాయకులు వేరువేరుగా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment