ఇసుక కొరత అధిగమించేందుకు చర్యలు
గద్వాల/రాజోళి/శాంతినగర్/అయిజ: ఇసుక అందుబాటులో ఉంచి, జిల్లాలో ఇసుక కొరతను అధిగమించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం జిల్లా మైనింగ్ ఏడీ వెంకటరమణతో కలిసి తుమ్మిళ్లలో కలెక్టర్ పర్యటించారు. తుంగభద్ర నదీ తీరంలో గల ఇసుక డీ–సిల్టేషన్ ప్రాంతాన్ని గుర్తించి పరిశీలించారు. గతంలో టీఎస్ ఎండీసీ ఆధ్వర్యంలో ఇక్కడి నుండే ఇసుక సరఫరా చేయగా, ప్రస్తుతం వారి కాంట్రాక్ట్ ముగియడం, దాని రెన్యూవల్ ప్రక్రియ నడస్తుండటంతో మళ్లీ ఇసుక సౌలభ్యం కోసం సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. అక్కడ ఉన్న ఇసుక నిల్వలను పరిశీలించి వాటి సరఫరా వేగవంతం చేయాలని అధికారులకు తెలిపారు. క్షేత్ర స్థాయిలో బౌగోళిక పరిస్థితులను పరిశీలించి ఇబ్బందులు తలెత్తకుండా టీఎస్ ఎండీసీ ఆద్వర్యంలో ఇసుక డీ–సిల్టేషన్ ను ప్రారంభించాలన్నారు. అంతకుముందు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్‌డీఎస్ ఈఈ శ్రీనివాస్,తహసీల్దార్ రామ్మోహన్,ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించాలి
ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించేందుకు స్థానిక రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారాన్ని అందించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాలులో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులతో ఓటరు నమోదు, బూత్‌లెవెల్ ఏజెంట్ల నియామకాలపై సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు వయసు నిండిన ప్రతిఒక్కరికి ఓటుహక్కు కల్పించేందుకు నిర్ణయించిందన్నారు. అదేవిధంగా పోలింగ్‌బూతులలో ఏజెంట్ల నియామకానికి సహకరించాలన్నారు. ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించేందుకు ఏదైనా అభ్యంతరాలుంటే ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. నూతన ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, మరణించిన వారి వివరాలను ఫామ్ 6,7,8 ద్వారా అందించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీవో శ్రీనివాస్‌రావు, తహసీల్దార్ మల్లిఖార్జున్, డీటీ కరుణాకర్, వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.