గద్వాల టౌన్: ప్రతి జీవికి నీరు ప్రాణాధారమని, విద్యార్థులు నీటి వినియోగం పట్ల అవగాహన ఏర్పరచుకోవాలని ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మీనాక్షి అన్నారు. శనివారం కళాశాల ఆవరణలో ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతల ఏర్పాటు విధానాన్ని, వాటి వల్ల భూగర్భజలం పెరుగుదల గురించి వివరించారు. ఇంకుడు గుంతల ఆవిష్యకతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ప్రిన్సిపాల్ మీనాక్షి మాట్లాడుతూ నీటి వృథాను తగ్గించుకొని, సహజ వనరులను పరిమితంగా వాడుకోవాలన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీప్రసాద్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ దేవుజా పాల్గొన్నారు.
వృత్తి నైపుణ్యాలు పెంచుకోవాలి..
యువత వృత్తి నైపుణ్యాలు పెంచుకుని, ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవాలని ఎంఏఎల్‌డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ షేక్ కలందర్‌బాషా అన్నారు. టాస్క్ ఆధ్వర్యంలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ శనివారం మెగా జాబ్ మేళా నిర్వహించగా.. జాబ్‌మేళాలో పాల్గొన్న సుమారు 250 మంది నిరుద్యోగులకు నైపుణ్యాలపై ఇంటర్వ్యూలు నిర్వహించి, ప్రతిభకనబర్చిన 106 మందిని ప్రైవేటు కంపెనీలలో వివిధ ఉద్యోగాల కోసం ఎంపిక చేశారు. కార్యక్రమంలో జిల్లా ఎంప్లాయ్‌మెంట్ అధికారి ప్రియాంక, వైస్ ప్రిన్సిపల్ చంద్రమోహన్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ రాధిక, టాస్క్ కోఆర్డినేటర్ సత్యమ్మ పాల్గొన్నారు.
బెట్టింగ్‌లకు
దూరంగా ఉండాలి
గద్వాల క్రైం: ఆన్‌లైన్ బెట్టింగ్ విషయంలో ప్రతిఒక్కరు జాగ్రత్తగా, దూరంగా ఉండాలని ఎస్పీ శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. యువత, విద్యార్థులు, ఎవరైనా అనుమతి లేని బెట్టింగ్ యాప్స్‌లకు అలవాటు పడి అప్పులపాలై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారన్నారు. జిల్లావ్యాప్తంగా ఎక్కడైనా బెట్టింగ్‌లకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. ఎవరైనా చెడు దారిలో నడుస్తున్నట్లు తెలిస్తే డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు.