ప్రాణం తీసిన వివాహేతర సంబంధం | - | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

Jun 11 2023 11:16 AM | Updated on Jun 11 2023 11:27 AM

- - Sakshi

తూర్పు గోదావరి: యువకుడి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే అతడి హత్యకు దారి తీసిందని నిర్ధారించారు. ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. కోరుకొండ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్సై కట్టా శారదా సతీష్‌తో కలిసి సీఐ ఉమామహేశ్వరరావు ఈ వివరాలు వెల్లడించారు.

ఆయన కథనం ప్రకారం.. హతుడు ముప్పిడిశెట్టి శ్రీను (34) స్వగ్రామం కోరుకొండ మండలం గాడాల. అతడు కోరుకొండలోని వెంకటగిరి లైటింగ్స్‌ అండ్‌ డెకరేటర్స్‌ సప్లై కంపెనీ యజమాని వెంకటగిరికి అల్లుడు. సప్లై కంపెనీ వ్యవహారాలను శ్రీనే చూసుకుంటున్నాడు. ఈ నెల 4వ తేదీ రాత్రి పశ్చిమ గోనగూడెం రోడ్డులోని ఎస్‌ఆర్‌ నగర్‌లో ఉన్న సప్లై కంపెనీ గోడౌన్‌ వద్ద గుర్తు తెలియని దుండగులు అతడి కళ్లల్లో కారం చల్లి, పొట్టలో కత్తులతో పొడిచి, పరారయ్యారు. ఆసుపత్రికి తరలించే లోపే శ్రీను మృతి చెందాడు. దీనిపై అతడి మామ వెంకటగిరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

మూడు నెలలుగా రెక్కీ
కర్నూలు జిల్లా దేవనకొండ గ్రామానికి చెందిన సబ్బు నాగార్జునరెడ్డి అలియాస్‌ అర్జున్‌రెడ్డి అలియాస్‌ అర్జున్‌ అలియాస్‌ నాగు కోరుకొండలోని ఓ ఫైనాన్స్‌ కంపెనీలో పని చేస్తున్నాడు. ప్రస్తుతం రాజానగరంలో నివాసం ఉంటున్నాడు. నాగార్జునరెడ్డితో పాటు ముప్పిడిశెట్టి శ్రీనుకు కోరుకొండ గ్రామానికి చెందిన వివాహిత కాళ్ల నాగలక్ష్మితో వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో నాగార్జునరెడ్డితో వ్యవహారాన్ని బయట పెడతానంటూ శ్రీను ఆమెను హెచ్చరించాడు. దీంతో విషయం తన భర్తకు తెలుస్తుందని నాగలక్ష్మి భయపడింది.

ఈ విషయాన్ని తన స్నేహితురాలు, కోరుకొండకు చెందిన ఫిట్‌నెస్‌ సెంటర్‌ నిర్వాహకురాలు ముత్యాల పద్మావతికి చెప్పింది. శ్రీనును హతమారిస్తే తప్ప ఈ సమస్య నుంచి బయట పడలేమని భావించిన వీరిద్దరూ ఈ విషయాన్ని నాగార్జునరెడ్డికి చెప్పారు. దీంతో శ్రీను హత్యకు నాగార్జునరెడ్డి, అతడి మిత్రులు గొడ్డు దిలీప్‌ (రాజానగరం), చొప్పెల్ల వెంకటేశ్‌ (రాజానగరం), సయ్యద్‌ అహ్మద్‌ (రాజానగరం), ఇంజమూరి రాజేంద్రప్రసాద్‌ (అనంతపురం జిల్లా గుత్తి – ప్రస్తుతం రాజానగరంలో ఉంటున్నాడు), కొవ్వాడ విజయ్‌కృష్ణ (గుమ్ములూరు, కోరుకొండ మండలం) పథక రచన చేశారు. ఈ నేపథ్యంలో అమెజాన్‌ నుంచి ఆన్‌లైన్‌లో కత్తి తీసుకున్నారు. మూడు నెలలుగా అదను కోసం వేచి చూస్తున్నారు. రెక్కీ నిర్వహించారు.

వెంబడించి.. హతమార్చి..
గ్రామ దేవత అంకాలమ్మ జాతర సందర్భంగా శ్రీను గత ఆదివారం రాత్రి పశ్చిమ గోనగూడెం రోడ్డులోని సప్లై కంపెనీ గోడౌన్‌కు ఒంటరిగా వెళ్తూ కనిపించాడు. అతడిని నాగార్జునరెడ్డి, గొడ్డు దిలీప్‌ మోటార్‌ సైకిల్‌పై వెంబడించారు. గోడౌన్‌ తలుపు కొట్టి, బయటకు వస్తున్న శ్రీను కళ్లల్లో కారం జల్లారు. నాగార్జునరెడ్డి, వెంకటేశ్‌లు శ్రీను చేతులు పట్టుకోగా దిలీప్‌ కత్తితో పొడిచి హతమార్చాడు.

అనంతరం నిందితులు పరారయ్యారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు హతుడు శ్రీను గురించి ఆరా తీశారు. దీంతో వివాహేతర సంబంధం విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడ తీగ లాగితే మొత్తం డొంకంతా కదిలింది. నిందితుల సెల్‌ఫోన్ల కాల్‌డేటా, సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా నిందితులు నాగార్జునరెడ్డి, దిలీప్‌, వెంకటేశ్‌, సయ్యద్‌ అహ్మద్‌, ఇంజమూరి రాజేంద్రప్రసాద్‌లను రాజానగరంలో అరెస్టు చేశారు. అలాగే కోరుకొండలో నాగలక్ష్మిని, పద్మావతిని, గుమ్ములూరులో కొవ్వాడ విజయ్‌కృష్ణను అరెస్టు చేశారు.

వారి నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, రెండు మోటార్‌ సైకిళ్లు, ఒక కారు, ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి సూచనల మేరకు, డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో ఎస్సై కట్టా శారదా సతీష్‌, తన సిబ్బందితో వివిధ బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేసి, ఈ కేసు మిస్టరీని ఛేదించారు. సాంకేతిక నిపుణుల సహాయం తీసుకున్నారు. వీరిని ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి, ఉన్నతాధికారులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement