కాకినాడ కల్చరల్: నేను–నాది అనే భావ దరిద్య్రాలను విడిచిపెట్టినప్పుడే వ్యక్తులతోపాటు దేశం బాగు పడుతుందని పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రవచనకర్త డాక్టర్ గరికిపాటి నరసింహారావు అన్నారు. స్థానిక సూర్యకళామందిర్‌లో సరస్వతీగాన సభ ఆధ్వర్యంలో మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న నలదమయంతి చరిత్రపై గరికిపాటి ప్రవచనాలు ఆదివారంతో ముగిశాయి. నలదమయంతుల కథను ఆదర్శంగా తీసుకొని జీవిత పయనంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంతో నిలవాలని అన్నారు. నలుడు అడవిలో దమయంతిని విడిచి వెళ్లిన తర్వాత ఆమె పడిన కష్టాలను వివరించారు.
సుందర రూపుడయిన నలుడు అడవిలో పాముకాటుకు గురై నల్లగా మారిపోవడం, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నలుడు, బాహుకుడనే పేరుతో ఋతుపర్ణ మహారాజు వద్ద వంటవానిగా చేరిన ఘట్టాలను వివరించారు. కష్టాలలో కూడా తనకు ఉన్న అవకాశాన్ని ఏవిధంగా సద్వినియోగం చేసుకోవాలో నలుడి వ్యక్తిత్వం తెలుపుతోందని వివరించారు. చివరకు ఇంద్రుని దయంతో నలుడు పూర్వ రూపం పొంది తన రాజ్యాన్ని దక్కించుకొన్న ఘట్టాలను వివరించారు.
ధైర్యంగా బతకాలి, సంతోషంగా మరణించాలని అన్నారు. అహంకారం, మమకారం రెండు ప్రమాదాలే అన్నారు. కష్టం వచ్చిందంటే వెనుక సుఖం వస్తోందని సూచన అని వివరించారు. జీవితంలో కష్టాలు పెరిగాయి అంటే అర్థం సుఖాలు రానున్నాయని భావించాలి తప్ప జీవితం ముగిసిపోయిందని అధైర్య పడరాదన్నారు. అలాగే ఎండలు మండిపోతున్నాయంటే వర్షాలు బాగా పడతాయని సూచన అని మండుతున్న ఎండలపై చమత్కరించారు.
అనంతరం సరస్వతీ గాన సభ సభ్యులు నరసింహరావును ఘనంగా సత్కరించారు. గాన సభ అధ్యక్షుడు కేవీఎస్ ఆంజనేయమూర్తి, కార్యదర్శి పేపకాయల రామకృష్ణ, ఉపాధ్యక్షులు ఎల్.సత్యనారాయణ్, నారాయణ్ మురళి, మునుగంటి వెంకట్రావు, శ్రీరామచందరమూర్తి, ఎస్‌కేవీడీ వెంకట్రావు, పెద్దాడ సూర్యకుమారి, చావలి సూర్యకుమారి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment