సాక్షిప్రతినిధి, కాకినాడ: ఏ ఆధారం లేని లక్షలాది మంది నిరుపేదలకు పింఛనే జీవనాధారం. అవ్వా, తాతలు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు.. ఇలా ఎందరో జీవితాల్లో పెన్షన్ వెలుగులు నింపుతోంది. పేదరికమే ప్రామాణికంగా అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికి ప్రస్తుత ప్రభుత్వం పింఛన్ మంజూరు చేస్తోంది. గత టీడీపీ ప్రభుత్వంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 2,30,914 మంది లబ్ధిదారులకు నెలకు రూ.2,540 కోట్లు సాయం అందేది. జగన్ ప్రభుత్వ సారథిగా పగ్గాలు చేపట్టాక నాలుగేళ్లలో గణనీయంగా కొత్త పింఛన్లు మంజూరు చేశారు. ప్రస్తుతం జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య 2,83,401 మందికి పెరిగింది. రూ.7,802 కోట్ల మేర ఆర్ధిక సాయం అందజేస్తోంది.
నాడు ఇలా..
టీడీపీ హయాంలో కొత్త పింఛన్ మంజూరవ్వాలంటే జన్మభూమి కమిటీ సభ్యుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. కమ్యూనిటీహాళ్లు, ఆలయాల వద్ద వృద్దులు, దివ్యాంగులు పడిగాపులు పడేవారు. ఒక్కోసారి వారం రోజుల వరకు కూడా పెన్షన్ అందేది కాదు. ఇలాంటి బాధలకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చరమగీతం పాడారు. అర్హతలున్నా సాంకేతిక కారణాలతో పింఛన్ అందక కష్టాల కడలిలో ఎదురీదుతున్న వారి కోసమే గత నెలలో ప్రత్యేకంగా దైవార్షిక నగదు మంజూరు పథకం తీసుకు వచ్చి అక్కున చేర్చుకున్నారు. దాదాపు అన్ని ఆర్థిక, ఆర్థికేతర అంశాలకు నెల తిరగకుండానే పరిష్కారం చూపించి భరోసా కల్పించారు. ఫలితంగా జిల్లాలో అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికి పింఛన్ సాయం అందుతోంది. ప్రతి రెండు మూడు కుటుంబాల్లో పింఛన్ లబ్ధిదారులు ఉంటున్నారు. ఒకటో తేదీన తెల్లారకుండానే ఠంచనుగా గడప చెంతకే వచ్చి పెన్షను నేరుగా వస్తుండటంతో వారి ఆనందానికి అవధులు లేవు.
వస్తుందా రాదా అనుకున్నా..
ఆలమూరుకు చెందిన కొండేపూడి విజయలక్ష్మి వయస్సు 47 సంవత్సరాలు. కుమార్తె, కుమారుడు ఉన్నారు. జనవరిలో భర్త సత్యనారాయణ ఆనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటికే కుమార్తెకు పెళ్లి చేసి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు. కుమారుడు ప్రవీణ్ లారీ డ్రైవర్. అతనికి వచ్చే చాలీచాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకు రావడం కష్టంగా మారింది. పింఛన్ వస్తే కొంత చేదోడుగా ఉంటాదని విజయలక్ష్మి ఆశపడింది. ఎక్కడికి తిరగాల్సిన పని లేకుండా వలంటీర్ వచ్చి దరఖాస్తు చేయించగా కొత్త పింఛన్ మంజూరైంది. ఈనెల 1న వలంటీర్ పింఛన్ సొమ్ము రూ.2750 ఇంటికి తీసుకువచ్చి ఇవ్వడం కొండంత భరోసానిచ్చినట్లు అయ్యిందని విజయలక్ష్మి సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపింది.
తప్పు సరిచేసి మంజూరు చేశారు
టీడీపీ ప్రభుత్వంలో పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నా రాలేదు. నేను నా భార్య కూలి పనులు చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్నాం. నాకు సెంటు భూమి లేకపోయినా రెండెకరాలు ఉన్నట్టు రికార్డుల్లో ఉండటంతో పింఛన్ రావడం లేదు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు దృష్టికి నా సమస్య తీసుకువెళ్లాను. ఆన్‌లైన్ నుంచి తొలగించడంతో వృద్ధాప్య పింఛన్ వచ్చింది. అవసరానికి ప్రతి నెలా ఒకటిన రూ.2750లు వస్తాయనే నమ్మకం ఏర్పడింది.
– కొంబత్తుల రామారావు, కొంబత్తులవారిపేట, అంబాజీపేట
ప్రాణం లేచి వచ్చింది
నాకు ముగ్గురు ఆడ పిల్లలు. పెళ్లిళ్లు చేసి అత్తవారిళ్లకు పంపించాను. నా భర్త ఇటీవల కాలం చేయడంతో బతుకు ముందుకు ఎలా సాగుతుందో అర్థం కాని పరిస్థితి. కాయకష్టం చేద్దామన్నా ఆరోగ్యం సహకరించక ఏ పని చేసుకోలేకపోతున్నాను. వలంటీరు ఇంటికి వచ్చి దరఖాస్తు చేయించి పింఛన్ మంజూరు చేయించారు. నా జీవితానికి నెల నెలా వచ్చే పింఛను మొత్తం సరిపోతుంది. జీతం మాదిరిగా ఒకటో తేదీనే వలంటీరు వచ్చి పింఛను ఇస్తున్నారు.
– అల్లవరపు రాము, వృద్ధాప్య పింఛనుదారు,ఇండుగపల్లి, కోటనందూరు మండలం
Comments
Please login to add a commentAdd a comment