హుండీ ఆదాయం రూ.11,61,650
పిఠాపురం: పాదగయ శ్రీ కుక్కుటేశ్వరస్వామి వారి దేవస్థానానికి హుండీల ద్వారా రూ.11,61,650 ఆదాయం సమకూరిందని ఈఓ కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ తెలిపారు. దేవదాయ, ధర్మదాయ శాఖ తనిఖీదారు వడ్డీ ఫణీంద్ర కుమార్ సమక్షంలో దేవస్థానం సిబ్బంది, సేవా సంఘం భక్తులు, పట్టణ ప్రముఖులు, బ్యాంక్ సిబ్బంది ఆధ్వర్యాన ఆలయంలో శనివారం హుండీల ఆదాయం లెక్కించామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నోట్లు రూ.10,42,690, చిల్లర నాణేలు రూ1,18,960 వచ్చాయని తెలిపారు.
61 వేల మంది రైతులకు
విశిష్ట గుర్తింపు సంఖ్య
పిఠాపురం: జిల్లాలోని 1.34 లక్షల మంది రైతుల్లో 61 వేల మందికి ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేశామని జిల్లా వ్యవసాయ అధికారి ఎన్.విజయ కుమార్ తెలిపారు. గొల్లప్రోలు మండలం మల్లవరం రైతు సేవా కేంద్రంలో జరుగుతున్న రిజిష్ట్రేషన్ పక్రియను ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, ఇతర వ్యవసాయ సంబంధిత సేవలను సులభంగా పొందడానికి ప్రతి రైతుకూ ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య ఇస్తున్నామన్నారు. రైతులు తమ ఆధార్ నంబర్, ఆధార్ అనుసంధానిత ఫోన్ నంబర్, పట్టాదారు పాస్ పుస్తకంతో గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల సిబ్బందిని సంప్రదించి, ఈ సంఖ్య పొందవచ్చన్నారు. ఈ నెలాఖరులోగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజయ కుమార్ కోరారు. కార్యక్రమంలో గొల్లప్రోలు మండల వ్యవసాయ అధికారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కౌన్సిలర్ ఇంటిపై దాడి
సామర్లకోట: స్థానిక 13వ వార్డు కౌన్సిలర్ నేతల హరిబాబు ఇంటిపై అదే ప్రాంతానికి చెందిన కొంత మంది గురువారం రాత్రి దాడి చేశారు. ఈ మేరకు హరిబాబు గురువారం అర్ధరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటికి వస్తున్న సమయంలో కొంత మంది తన కారుకు అడ్డంగా వచ్చారని, కారు అద్దాలు పగులగొట్టారని తెలిపారు. దీనిపై ప్రశ్నిస్తే తనపై దౌర్జన్యానికి, తన ఇంటిపై దాడికి దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుల అండతోనే ఈ దాడి జరిగిందని, తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ దాడిపై పూర్తి స్థాయి విచారణ జరిపి, న్యాయం చేయాలని హరిబాబు డిమాండ్ చేశారు. ఈ మేరు సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గోల్డ్ లోన్ బాధితులకు
నెల రోజుల్లో న్యాయం
తుని రూరల్: తేటగుంట కెనరా బ్యాంకులో గోల్డ్ లోన్ల అవకతవకలు వాస్తవమేనని, బాధితులందరికీ నెల రోజుల్లో న్యాయం చేస్తామని ఇన్‌చార్జి బ్రాంచి మేనేజర్ ఏసుదాసు చెప్పారు. ‘కెనరా బ్యాంకులో గోల్డ్ లోన్ల గోల్‌మాల్’ శీర్షికన ‘సాక్షి’ శనివారం వార్త ప్రచురించిన నేపథ్యంలో బంగారం తాకట్టు పెట్టి, రుణాలు పొందిన వారు పెద్ద సంఖ్యలో బ్యాంకుకు చేరుకున్నారు. ఇన్‌చార్జి మేనేజర్‌ను కలసి వారి బంగారం గురించి ఆరా తీశారు. ప్రస్తుతం ఆడిట్ జరుగుతోందని, ఈ ప్రక్రియ నాలుగైదు రోజుల్లో పూర్తవుతుందని వారికి ఏసుదాసు బదులిచ్చారు. ఇప్పటికే మేనేజర్ సహా ముగ్గురిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారని తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి అక్రమాలు జరగకుండా చూస్తామని చెప్పారు. సమస్య పరిష్కారానికి సహకరించాలని కోరారు. గోల్డ్ లోన్ల గోల్‌మాల్‌లో అప్రైజర్ ప్రధాన పాత్ర ఉండటంతో తుని రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మొత్తం 160 ఖాతాల్లో గోల్డ్ లోన్ల అక్రమాలు జరిగినట్టు తెలుస్తోంది. ఎక్కువ మంది రుణం తిరిగి చెల్లించి, బంగారు నగలు తీసుకు వెళుతున్నారు. నగలు తక్కువ ఉన్న బాధితులు ఏయే వస్తువులు గోల్‌మాల్ అయ్యాయో పేర్కొంటూ బ్యాంకుకు ఫిర్యాదులు చేస్తున్నారు.
హుండీ ఆదాయం రూ.11,61,650
Comments
Please login to add a commentAdd a comment