
ముస్తాబవుతున్న పాదగయ
పిఠాపురం: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పిఠాపురం పాదగయ క్షేత్రం మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నెల 24న నిర్వహించనున్న అంకురార్పణతో ప్రారంభం కానున్న శివరాత్రి ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. పాదగయ క్షేత్రాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో పాటు అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేయనున్నారు. మహా శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని వారం రోజుల పాటు ప్రతి నిత్యం ఈ క్షేత్రంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ప్రత్యేక లక్షపత్రి పూజలు, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహిస్తారు. వీటికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా పాదగయ పుష్కరిణిలో లక్షలాదిగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇటీవల పాత నీటిని తొలగించి, పుష్కరిణిని పూర్తిగా శుభ్రపరచి, అవసరమైన మరమ్మతులు చేసి, కొత్త నీటితో నింపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కువ మంది భక్తులు ఒకేసారి పుణ్యస్నానాలు ఆచరించేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు.
కుక్కుటేశ్వర స్వామి కల్యాణోత్సవాలు ఇలా..
● పాదగయ క్షేత్రంలో శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వరస్వామివారి దివ్య కల్యాణ మహోత్సవం ఈ నెల 24వ తేదీ రాత్రి 8.32 గంటల సుముహూర్తానికి నిర్వహిస్తారు.
● 25వ తేదీన స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు.
● 26న మహా శివరాత్రి పర్వదినం.
● 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు నాకబలి, దండియాడింపు, దొంగలదోపు ఉత్సవాలు, రథోత్సవం.
● 28వ తేదీన స్వామి వారి త్రిశూల స్నానం, తెప్పోత్సవం, శ్రీ పుష్పోత్సవం.
పీఎం సూర్యఘర్‌పై
అవగాహన కల్పించాలి
కాకినాడ సిటీ: పీఎం సూర్యఘర్ పథకం కింద ప్రతి ఇంటిపై సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసుకునేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. పీఎం సూర్యఘర్, పీఎం కుసమ్ యోజనపై కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన సమీక్షించారు. జిల్లాలో ఇప్పటి వరకూ 671 మంది తమ ఇళ్లపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. వ్యవసాయంలో సౌరశక్తిని ప్రోత్సహించడానికి అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ ఉర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ (పీఎం కుసుమ్) యోజన ద్వారా రైతులకు సబ్సిడీపై సోలార్ పంపుల పంపిణీకి, పునరుత్పాదక ఇంధన ఆధారిత విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు జిల్లాలో అనువైన భూములను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు పోలవరం ఎడమ కాలువను ఆనుకుని ఖాళీగా ఉన్న ప్రదేశాలపై సర్వే చేసి, నివేదిక సమర్పించాలన్నారు. సమావేశంలో ఏపీ ఈపీడీసీఎల్ ఎస్‌ఈ జి.ప్రసాద్, పోలవరం ఎస్‌ఈ బి.ఏసుబాబు, డీఆర్‌డీఏ పీడీ ఎ.శ్రీనివాసరావు, రెవెన్యూ, సర్వే అధికారులు పాల్గొన్నారు.
సాంకేతిక నైపుణ్యం
మెరుగుపరచుకోవాలి
సామర్లకోట: సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్లు సాంకేతిక నైపుణ్యం మెరుగుపరచుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఇ.కృష్ణమోహన్ అన్నారు. శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకూ ఉన్న 11 జిల్లాల్లో ఎంపిక చేసిన 40 మంది సచివాలయాల డిజిటల్ అసిస్టెంట్లకు సెంటర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నిక్స్(ఐసీటీ)పై స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో మూడు రోజుల శిక్షణను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి జిల్లా నుంచీ నలుగురు డిజిటల్ అసిస్టెంట్లకు ఈ శిక్షణ ఇస్తామని చెప్పారు. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్‌ఐఆర్‌డీ పీఆర్) ప్రొఫెసర్లు ఈ శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. డిజిటల్ టూల్స్‌పై నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవాలని సూచించారు. ఎన్‌ఐఆర్‌డీ పీఆర్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎంవీ రవిబాబు మాట్లాడుతూ, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌పై డిజిటల్ అసిస్టెంట్లు పట్టు సాధించేలా శిక్షణ ఉంటుందని తెలిపారు. శిక్షణలోని ముఖ్యాంశాలను ఎన్‌ఐఆర్‌డీ పీఆర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజేశ్వరరావు వివరించారు.

ముస్తాబవుతున్న పాదగయ
Comments
Please login to add a commentAdd a comment