
ప్రజాస్వామ్యానికి చంద్రబాబు తూట్లు
● బలం లేకపోయినా వైస్ చైర్మన్
పదవి కోసం దౌర్జన్యాలు
● మళ్లీ తుని నుంచే టీడీపీ
పతనం ప్రారంభం
● మాజీ మంత్రి దాడిశెట్టి రాజా
తుని: ప్రశాంతకు రోల్‌మోడల్‌గా ఉండే తునిని అల్లర్లు, దౌర్జన్యాలు, అక్రమ కేసులకు నిలయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మార్చేశారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా మండిపడ్డారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మంగళవారం చోటు చేసుకున్న పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ కౌన్సిల్‌లో బలం లేని టీడీపీ.. వైస్ చైర్మన్ పదవి కోసం దౌర్జన్యాలకు పాల్పడటం హేయమని అన్నారు. కలెక్టర్, ఎస్పీ ఆదేశాలను తుని పోలీసులు, అధికారులు పాటించలేదని దుయ్యబట్టారు. తునిలో యనమల రామకృష్ణుడి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని అన్నారు. వైఎస్సార్ సీపీకి పూర్తి స్థాయి బలం ఉన్నా ఎన్నిక జరగకుండా వాయిదా వేయడం కుట్రలో భాగమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిలర్లను ఓటింగ్‌కు రమ్మని డీఎస్పీ, అధికారులు చెప్పి తీసుకువెళ్లి, టీడీపీ రౌడీలతో కిడ్నాప్ చేయించాలని చూశారని, ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని మహిళా కౌన్సిలర్లు పరుగులు తీసిన దృశ్యాలు మీడియాలో లైవ్‌లో కనిపించినా టీడీపీ నాయకులకు సిగ్గు లేదని విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఇటువంటి ఘోరాలు చేయించడం పరిపాటి అని అన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. 2016లో కాపు గర్జన సందర్భంగా చోటు చేసుకున్న అల్లర్లు, రైలు దహనం ఘటనలో తనపై 16 అక్రమ కేసులు పెట్టించారని, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ప్రభావాన్ని కోల్పోయిందని గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ టీడీపీ పతనం తుని నుంచి ప్రారంభమవుతుందని దాడిశెట్టి రాజా చెప్పారు. పాలకుడు సరైనవాడు కాకపోతే అరాచకం రాజ్యమేలుతుందని, తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా జరిగిన సంఘటనలే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. టీడీపీ రౌడీ మూకల నుంచి సహచర కౌన్సిలర్లను రక్షించేందుకు అశ్రయం ఇచ్చిన మున్సిపల్ చైర్‌పర్సన్ ఏలూరి సుధారాణి పైన, తన పైన పోలీసులు కేసులు పెట్టారని చెప్పారు. సక్రమంగా విధులు నిర్వహిస్తే పోలీసులను ఎందుకు విమర్శిస్తామని రాజా అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, యనమల కృష్ణుడు, వాసిరెడ్డి జమీల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment