
ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నా పట్టించుకోరా?
● డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కన్నబాబు ప్రశ్న
● ప్రభుత్వ తీరు దుర్మార్గమని
మండిపాటు
పిఠాపురం: జిల్లాలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నా ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పట్టించుకోకపోతే ఎలాగని వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు ప్రశ్నించారు. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా టీడీపీ చేస్తున్న అరాచకాలకు నిరసనగా పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పిలుపు మేరకు వైఎస్సార్ సీపీ శ్రేణులు భారీగా మంగళవారం చలో తునికి బయలుదేరారు. వారిని గొల్లప్రోలు టోల్‌ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీనిని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు టోల్‌ప్లాజా వద్ద రోడ్డుపై బైఠాయించి, ఆందోళన నిర్వహించారు. పోలీసులు, ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ, తునిలో జరుగుతున్న అప్రజాస్వామిక చర్యలను పవన్ కల్యాణ్ ఖండించాలని డిమాండ్ చేశారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు, ఆయన కుమార్తె ఎమ్మెల్యేగా ఉన్న తునిలో ఇంతటి దారుణాలు జరుగుతూంటే ఇక రాష్ట్రంలో పాలన ఎలా ఉందో అర్థమవుతుందని అన్నారు. ఎవ్వరూ ఎప్పుడూ తమ రాజకీయ జీవితంలో ఇటువంటి దారుణ ఘటనలను చూడలేదన్నారు. తునిలో కేవలం చిన్న వైస్ చైర్మన్ ఎన్నిక కోసం టీడీపీ, కూటమి నేతలు యుద్ధ వాతావరణం సృష్టించారని మండిపడ్డారు. ఒక్క కౌన్సిలర్ కూడా లేని తునిలో టీడీపీ, జనసేన నేతలు వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురి చేసి, దౌర్జన్యంగా పదవి లాక్కోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఒక్క వైస్ చైర్మన్ ఎన్నిక కోసమే ఇంత దారుణాలకు తెగబడితే, ఇక రాష్ట్రంలో ఏ రాజ్యాంగం అమలవుతోందని ఆయన ప్రశ్నించారు. నిషేధాజ్ఞలు టీడీపీ వారికి వర్తించవా? వారికో న్యాయం, తమకొక న్యాయమా అని పోలీసులను ప్రశ్నించారు. టీడీపీ నేతలంతా తునిలో మోహరించి ఉంటే పోలీసులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కౌన్సిలర్లను కౌన్సిల్ హాల్‌కే వెళ్లడానికి వీలు లేదంటే ప్రజాస్వామ్యం ఎలా ఉందో తెలుస్తోందని దుయ్యబట్టారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తే.. దానిని కూడా ఎన్నికల కమిషన్‌ను అడ్డం పెట్టుకుని ఆపారని, తరువాత వైఎస్సార్ సీపీ ఘన విజయం సొంతం చేసుకుందని గుర్తు చేశారు. కూటమి నేతల మాదిరిగా తామూ ప్రవర్తించి ఉంటే ఇతర పార్టీలకు చెందిన ఒక్క కౌన్సిలర్ అయినా కౌన్సిల్‌లో కూర్చోగలిగే వారా అని ప్రశ్నించారు. ‘మీరు తప్పు చేయకపోతే మమ్మల్ని ఆపాల్సిన అవసరం ఏముంది? ఎందుకంత భయపడుతున్నారో చెప్పాలి’ అని కన్నబాబు ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్ వంగా గీత, రామచంద్రపురం ఇన్‌చార్జి పిల్లి సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నా పట్టించుకోరా?

ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నా పట్టించుకోరా?
Comments
Please login to add a commentAdd a comment