చికెన్.. రేటు ఢమాల్
● బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్
● ముక్క ముట్టేందుకు భయపడుతున్న జనం
● పడిపోయిన చికెన్, గుడ్డు ధరలు
కాకినాడ సిటీ: బర్డ్‌ప్లూ విజృంభించి, లక్షలాదిగా కోళ్లు చనిపోతున్న నేపథ్యంలో జిల్లాలో చికెన్, కోడిగుడ్ల ధరలు గణనీయంగా పడిపోయాయి. బర్డ్‌ఫ్లూ ప్రభావం జిల్లాను తాకనప్పటికీ, ఇతర జిల్లాల్లో ఈ వ్యాధి సోకిందనే వార్తలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. జిల్లాలో ఈ వ్యాధి సోకిందనే పుకార్లు వ్యాపించడం, చికెన్, గుడ్లు తినరాదని ప్రసార మాధ్యమాల్లో వస్తూండటంతో ముక్క ముట్టేందుకు చికెన్ ప్రియులు జంకుతున్నారు. అయితే, జిల్లాలో ఈ వ్యాధి లేదని, దీనిపై భయపడనక్కరలేదని పశు సంవర్ధక శాఖ అధికారులు అంటున్నారు.
జిల్లాలో కోళ్ల పెంపకంపై నేరుగా ఆధారపడి దాదాపు 12 వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. అలాగే దాదాపు 30 వేల కుటుంబాలకు పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. ఫామ్‌లలో ప్రతి నెలా 64 లక్షల నుంచి 90 లక్షల బ్రాయిలర్ కోళ్లు, 30 లక్షల లేయర్ కోళ్లు, లక్షకు పైగా నాటు కోళ్ల పెంపకం జరుగుతోంది. ప్రతి రోజూ దాదాపు 6 లక్షలకు పైగా కోళ్లు జిల్లా నలుమూలలకూ రవాణా అవుతున్నాయి. ఇతర జిల్లాలకు మరో 2 లక్షల కోళ్లు సరఫరా అవుతున్నాయి. వీటిలో సాధారణంగా 3 నుంచి 5 శాతం మరణాలుంటాయని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, కొన్ని రోజులకు ముందు కిలో చికెన్ ధర రూ.240 నుంచి రూ.260 వరకూ ఉండేది. బర్డ్‌ఫ్లూ భయంతో అది కాస్తా ప్రస్తుతం రూ.170కి పడిపోయింది. లైవ్ కోడి రూ.85 మాత్రమే పలుకుతోంది. లైవ్ రూ.110కి విక్రయిస్తేనే గిట్టుబాటు అవుతుందని పెంపకందార్లు చెబుతున్నారు.
అధికారులు అప్రమత్తం
బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో జిల్లాలోని కోళ్ల పరిశ్రమదారులను అధికారులు అప్రమత్తం చేశారు. జిల్లాలో కోళ్లకు ఎక్కడా బర్డ్‌ఫ్లూ సోకిన దాఖలాలు లేవని పశు సంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. కోళ్లు చిన్న జబ్బు పడినట్లు తెలిసినా వెంటనే వైద్యులకు సమాచారం అందించేలా చర్యలు చేపట్టారు. జిల్లాలోని 21 మండలాలకు 42 విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేసి, కోళ్ల ఫామ్‌లను తనిఖీ చేస్తున్నారు. కోళ్లు చనిపోతే కారణమేమిటో వైద్యులు నిర్ధారించేలా చర్యలు తీసుకున్నారు. ఇతర జిల్లాల నుంచి కోళ్ల రవాణాను నియంత్రించేందుకు ప్రత్యేక టీములను ఏర్పాటు చేశారు.
పక్షుల ద్వారా వ్యాపించే అవకాశం
జిల్లా ఎక్కడా బర్డ్‌ఫ్లూ లక్షణాలు నమోదు కాలేదు. అన్ని శాఖల సమన్వయంతో ముందస్తు చర్యలకు ఉపక్రమించాం. పక్షుల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తికి ఆస్కారం అధికంగా ఉంది. అందువలన కోళ్ల ఫామ్‌ల వద్ద పక్షుల సంచారం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించాం. కోడిగుడ్లు, చికెన్ బాగా ఉడికించి తినవచ్చు.
– డాక్టర్ ఎస్.సూర్యప్రకాశరరావు,
జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి, కాకినాడ
చికెన్.. రేటు ఢమాల్
Comments
Please login to add a commentAdd a comment