శత్రువుకు దడ పుట్టేలా.. | - | Sakshi
Sakshi News home page

శత్రువుకు దడ పుట్టేలా..

Published Fri, Apr 11 2025 12:38 AM | Last Updated on Fri, Apr 11 2025 12:38 AM

శత్రు

శత్రువుకు దడ పుట్టేలా..

కాకినాడ రూరల్‌: శత్రువుకు దడ పుట్టేలా ఇండో – అమెరికన్‌ టైగర్‌ ట్రయంఫ్‌–25 విన్యాసాలు కాకినాడ తీరంలో జరుగుతున్నాయి. ఇరు దేశాలకు చెందిన వైమానిక దళాలు గురువారం సంయుక్త విన్యాసాలతో అదరగొట్టాయి. సాధారణ ప్రజలకు అనుమతి లేనప్పటికీ ఈ విన్యాసాలు చూసేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. గురువారం ఉదయం యుద్ధ విమానాలు, హెలికాప్టర్‌లు కాకినాడ తీర ప్రాంతంతో పాటు సూర్యారావుపేట, వలసపాకల, వాకలపూడి గ్రామాల్లో చక్కర్లు కొట్టాయి. ఆకాశం నుంచి పెద్ద శబ్దం రావడంతో ఇళ్లలోని వారు బయటకు వచ్చి, వాటిని ఆసక్తిగా తిలకించారు. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ 157హెచ్‌యూకు చెందిన ఎంఐ–17వీ5 ద్వారా 16 మంది యూఎస్‌ స్పెషల్‌ ఫోర్సెస్‌, గరుడ, పారా కమాండోలను యాంఫిబియస్‌ విన్యాసాలు జరిగే కాకినాడ బీచ్‌లోని నావెల్‌ ఎన్‌క్లేవ్‌ వద్ద బీచ్‌ ల్యాండింగ్‌ జోన్‌(ఎల్‌జెడ్‌)కు చేర్చారు. బీచ్‌లోకి సందర్శకులు రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

రైతులకు మద్దతు ధర అందేలా

చర్యలు : జేసీ రాహుల్‌ మీనా

పిఠాపురం: ఏ ఒక్క రైతూ మద్దతు ధర కంటే తక్కువకు ధాన్యం అమ్ముకుని నష్టపోకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌ మీనా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రైవేటు వ్యాపారులు సిండికేటుగా మారి రైతుల నుంచి తక్కువ రేటుకు ధాన్యం కొనుగోలు చేస్తూ, దోచుకుంటున్న వైనంపై ఈ నెల 9న ‘దోపిడికే ప్రాధాన్యం’ శీర్షికన ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి ఆయన స్పందించారు. జిల్లా పౌరసరఫరాల అధికారి ఎండీ నాయక్‌, డీసీఓ మురళీకృష్ణ, మండల వ్యవసాయ అధికారి అచ్యుతరావు తదితరులతో కలిసి జేసీ గురువారం గొల్లప్రోలు ఎంపీడీఓ కార్యాలయంలోని గొల్లప్రోలు–1 రైతు సేవా కేంద్రాన్ని సందర్శించారు. ధాన్యం కొనుగోలుపై గ్రామ వ్యవసాయ సహాయకులు, సిబ్బందితో మాట్లాడారు. ఈ సందర్భంగా జేసీ రాహుల్‌ మీనా మాట్లాడుతూ, వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, కొనుగోళ్లు ప్రారంభించాలని సిబ్బందికి సూచించారు. కొనుగోళ్లపై విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. రైతులకు అవసరమైన గోనెసంచులు కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ సత్యనారాయణ కూడా పాల్గొన్నారు.

గ్యాస్‌ ధర పెంపుపై నిరసన

కాకినాడ సిటీ: వంట గ్యాస్‌ ధరను కేంద్ర ప్రభుత్వం రూ.50 పెంచడాన్ని నిరసిస్తూ సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యాన కాకినాడలో గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కొత్త కాకినాడ నుంచి రామాలయం, డైరీ ఫామ్‌ రోడ్డు, ఏల్చూరి పాపారావు ఇంటి మీదుగా మదర్‌ థెరిస్సా బొమ్మ వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు మాట్లాడుతూ, అటు మోదీ, ఇటు కూటమి ప్రభుత్వాల దెబ్బకు ప్రజల జీవన విధానం కుదేలైందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత గ్యాస్‌ పేరుతో ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఆర్భాటంగా ప్రచారం చేశారని గుర్తు చేశారు. తీరా ఎన్నికల్లో నెగ్గిన తర్వాత వంట గ్యాస్‌పై రూ.50 పెంచి ప్రజలపై భారం మోపడమేమిటని దుయ్యబట్టారు. ఇప్పటికే గడచిన 10 నెలల కాలంలో విద్యుత్‌ చార్జీలు, మందులు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, ఆస్తిపన్ను, నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచారని విమర్శించారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న బాదుడే బాదుడంటూ చంద్రబాబు ఆందోళనకు దిగారని, ఇప్పుడు ఆయన చేసినదేమిటని మధు ప్రశ్నించారు. సీపీఐ నాయకులు కె.బోడకొండ, తోకల ప్రసాద్‌ మాట్లాడుతూ, ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

శత్రువుకు దడ పుట్టేలా.. 1
1/2

శత్రువుకు దడ పుట్టేలా..

శత్రువుకు దడ పుట్టేలా.. 2
2/2

శత్రువుకు దడ పుట్టేలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement