
పోషక విలువల లక్ష్మణ ఫలం
పిఠాపురం: మన పురాణ పురుషులు అయిన రాముడు, సీత, లక్ష్మణుల పేర్లతో సీతాఫలం, రామఫలంతో పాటు ఇప్పుడు లక్ష్మణ ఫలం స్థానికంగా పండుతున్నాయి. పలువురు రైతులు తమ ఇళ్ల వద్ద, పొలాల్లోను వీటిని పండిస్తున్నారు. దీనిని తింటే క్యాన్సర్ తగ్గుతుందని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్న తరుణంలో వీటి పెంపకం చాలాచోట్ల పెరిగింది. దీనిని ఆంగ్లంలో సోర్‌సో గ్రావియోలా అని పిలుస్తారు. దీనిలో ప్రొటీన్, కాల్షియం, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, తయామిన్, రెబోఫ్లోవిన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్సు వంటి ఎన్నో పోషక విలువలు ఉంటాయి. దీని జ్యూస్ తాగితే దానిలోని పోషక విలువలు ఇన్‌ఫెక్షన్లను నివారిస్తాయి. 12 రకాల క్యాన్సర్ కణాలను నాశనం చేసే సామర్థ్యం ఈ లక్ష్మణ ఫలానికి ఉందని ఆయుర్వేదం చెబుతోంది. అందుకే లక్ష్మణ ఫలాన్ని తింటే మంచినిద్ర పట్టడంతో పాటు డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు దూరమవుతాయి. రక్తహీనతను తగ్గించే గుణం దీనిలో ఉంది. ఎముకలను ధృడంగా మార్చి కీళ్ల నొప్పులను నివారిస్తుంది. చెడు కొలస్ట్రాల్ కరిగి మంచి కొలస్ట్రాల్ పెరుగుతుంది. రక్తపోటు స్థాయిలు అదుపులో ఉంటాయి. నీరసం, అలసట దూరమై శరీరానికి మంచి శక్తి లభిస్తుంది. మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లతో బాధ పడే వారికి ఇది ఒక మెడిసిన్‌లా పని చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. మార్చి, ఏప్రిల్ మాసాలలో ఈ పండ్లు అందుబాటులోకి వస్తాయి. పోర్చుగీసు నుంచి ఈ పండ్లు దిగుమతి అయినట్లు చెబుతుంటారు. వీటిని పండుగా తినడంతో పాటు స్వీట్లు, జ్యూస్‌లు, ఐస్‌క్రీంలు, జామ్‌ల తయారీలో వినియోగిస్తారు. ధర కిలో రూ.1,400 వరకు పలుకుతోందంటే దీని విలువ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

పోషక విలువల లక్ష్మణ ఫలం