
అంబేడ్కర్ విగ్రహానికి అవమానం
శంఖవరం: మండల కేంద్రమైన శంఖవరంలో మంగళవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి అవమానం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేయడంతో దళిత సంఘాలు అగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అంబేడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం దళితవాడలో అంబేడ్కర్ విగ్రహం మెడలో చెప్పుల దండ చూసి స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న దళిత సంఘాల నేతలు శంఖవరం చేరుకుని నిరసన ప్రదర్శన చేపట్టారు. స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనతో ర్యాలీ చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద కత్తిపూడి – శంఖవరం ప్రధాన రహదారిని దిగ్బంధించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ అంబేడ్కర్ విగ్రహానికి అవమానం జరగడం అంటే యావత్తు భారతజాతికి అవమానం జరిగినట్లు అని తెలిపారు. ఈ ఘటనకు కారకులైనవారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్పీ బిందు మాధవ్ ఘటనా స్థలానికి చేరుకుని 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేస్తామన్నారు. దళిత సంఘాల నాయకులు సంయమనం పాటించాలని సూచించారు. ఎస్పీ హామీ మేరకు దళిత సంఘాలు నిరసన కార్యక్రమాన్ని విరమించుకున్నాయి. అడిషినల్ ఎస్పీ ఎంజేవీ భాస్కరరావు, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, తుని సీఐ చెన్నకేశవరావు ఎస్పీ వెంట ఉన్నారు. దళిత సంఘాల నాయకులు శెట్టిబత్తుల కుమార్‌రాజా, టి.కిరణ్‌కుమార్, సోనిహుడ్, వెంకటరత్నం, చరమర్ల మదు, గోళ్ల శేఖర్, పులి సుధాకర్, పి.భరత్ పాల్గొన్నారు.
నిందితులను శిక్షించాలి : ముద్రగడ గిరిబాబు
భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి ముద్రగడ గిరిబాబు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. కులమతాలకు అతీతంగా సమసమాజ స్థాపన కోసం చిరస్మరణీయ కృషిచేసిన అంబేడ్కర్‌ను అవమానించడం దారుణమన్నారు.
చెప్పుల దండ వేసిన దుండగులు
ఆగ్రహించిన దళిత సంఘాల నేతలు
శంఖవరంలో రహదారి దిగ్బంధం
నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్
ఎస్పీ హామీతో ఆందోళన విరమణ

అంబేడ్కర్ విగ్రహానికి అవమానం