
ముందున్నది బంగరు భవిత
● ఒక్క ఫలితం జీవితాన్ని నిర్దేశించదు
● ఆత్మహత్యకు పాల్పడితే ఎందరికో క్షోభ
● ఒత్తిడిని, నిరాశను దరిచేరనీయొద్దు
● చదువులో వెనకబాటు అత్యంత సహజం
● ప్రతికూల ఫలితం వస్తే తల్లిదండ్రులు
అండగా నిలచి భరోసా ఇవ్వాలి
● పిల్లల్లో మానసిక స్థైర్యాన్ని నింపాలి
● 23న పదో తరగతి పరీక్షా ఫలితాలు
రాయవరం: చదువులో ఒత్తిడి.. ర్యాంకులు.. మార్కులు.. ఆత్మన్యూనత.. ఇలా కారణం ఏదైనా కావచ్చు.. నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధంతరంగా ముగించేస్తున్నారు. తాజాగా అంబాజీపేటలో ఒక బాలిక పదో తరగతి ఫలితాల్లో ఫెయిలవుతానన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నెల 23న పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. ఒత్తిడితో ప్రాణాలను బలి తీసుకోవద్దని, ఒత్తిడిని చంపేసి ఉజ్వల భవితకు బాటలు వేసుకోండని, ఆత్మ స్థైర్యాన్ని పెంచుకోవాలని మానసిక నిపుణులు, విద్యావేత్తలు సూచిస్తున్నారు.
జీవితంలో పాసైన వారెందరో
మనిషి జీవితంలో ఒడుదొడుకులు సహజం. కష్టం వచ్చిందని కుంగిపోతే రేపటి పనిని పూర్తి చేయలేం. ఈ విషయాన్ని పిల్లలు గుర్తించాలి.
● గోదావరి జిల్లాలకే చెందిన ఎల్లాప్రగడ సుబ్బారావు ఇంటర్ మూడుసార్లు తప్పినా ప్రపంచంలో అత్యంత గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగారు. ఎన్నో యాంటీ బయాటిక్స్‌ను కనుగొన్నారు. రక్తహీనత ఎందుకు వస్తుందో కనిపెట్టి దానికి చికిత్సా విధానాలను కనిపెట్టారు.
● చిన్నతనంలో మొద్దబ్బాయ్‌గా పిలవబడిన ఐన్‌స్టీన్ ప్రపంచ విఖ్యాత శాస్త్రవేత్త అయ్యారు.
● ప్రపంచాన్ని శాసిస్తున్న మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ విద్యార్థిగా వెనుకబడిన వారే.
● సచిన్ టెండూల్కర్ చదువులో రాణించలేక పోయినా తాను ఎంపిక చేసుకున్న క్రికెట్ రంగంలో ప్రపంచ కీర్తిని పొందాడు.
● స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు విద్యాభ్యాసంలో వెనుకబడినా, తనకిష్టమైన నటనా రంగంలో పేరు ప్రతిష్ఠలు సంపాదించారు.
● పదిలో ఫెయిలై డాక్టర్లు అయిన వారు, ఐఏఎస్‌లు అయిన వారు ఎందరో ఉన్నారు.
● చదువుపై ఇష్టం లేకుంటే తమకు ఆసక్తి ఉన్న క్రీడలు, సంగీతం, వ్యాపారం ఇలా వారికి నచ్చిన రంగాన్ని ఎన్నుకోవాలి.
ఫలితాలు విడుదలయ్యే సమయం
ఏప్రిల్, మే నెలలు పరీక్షా ఫలితాలు విడుదలయ్యే సమయం. ఇప్పటికే ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. మరో మూడు రోజుల్లో పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. అలాగే డిగ్రీ, పీజీ వంటి పలు ఉన్నత కోర్సుల ఫలితాలు విడుదలవుతాయి. ఈ ఫలితాలు కొందరికి మధురానుభూతిని..మరికొందరికి చేదు జ్ఞాపకాలను మిగల్చడం సహజం. ఇంటర్ ఫలితాల్లో కొందరు అత్యుత్తమ మార్కులు సాధిస్తే, మరికొందరు ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నాయని, ఇంకొందరు పరీక్ష తప్పామని క్షణికావేశానికి లోనై కాని పనులు చేస్తున్నారు.
పదితో ప్రారంభం
పదో తరగతి నుంచే విద్యార్థులకు ఒత్తిడి ప్రారంభమవుతోంది. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలని కొందరు తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అసలు సిసలైన పరీక్ష మొదలవుతుంది. జీవితంలో స్థిరపడడానికి అవసరమైన ఇంటర్మీడియేట్‌లో చేరతారు. ఇక్కడా అదే ఒత్తిడి. బాగా చదవాలని తల్లిదండ్రులు రూ.లక్షలు వెచ్చించి కార్పొరేట్ విద్యా సంస్థల్లో చేర్పించి ఆనక ఉత్తమ ఫలితాల కోసం పిల్లలపై ఒత్తిడి పెంచుతారు.
ప్రశాంతంగా ఆలోచించాలి
ఫలితాలు ఎలా ఉన్నా.. కాసేపు ప్రశాంతంగా ఆలోచించుకుని ఆత్మ విమర్శ చేసుకుంటే చాలని, అనవసర మైన ఆందోళనలకు ఒత్తిడికి గురై తప్పుడు దారులు వెతకరాదని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ఓటమి విజయానికి తొలి మెట్టని, నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నది వీరి సూచన. ఎందుకు ఓడిపోయాం? కారణమేమై ఉంటుంది? మరోసారి అలాంటి తప్పు జరగకుండా సరిదిద్దుకుని మళ్లీ ప్రయత్నిస్తే విజయం తప్పక వరిస్తుందని మానసిక నిపుణులు అభిప్రాయం.
విద్యార్థులకు సూచనలు
● పాస్, ఫెయిల్ అన్నవి సాధారణ విషయాలు.
● జీవితం ఎంతో విలువైనది. భవిష్యత్‌లో ఎన్నో విజయాలు సాధిస్తామన్న సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి.
● ఏ ఫలితమూ జీవితాన్ని నిర్దేశించదు.
● వ్యతిరేక ఫలితం ఎదురైతే కాసేపు ప్రశాంతంగా ఆలోచించి జరిగిన పొరపాటును గుర్తించాలి.
● ఒత్తిడి నుంచి వేగంగా బయటపడే ప్రయత్నం చేయాలి.
● జరిగిన తప్పును వీలైనంత వరకు తల్లిదండ్రులకు చెబితే 90 శాతం భారం దిగి పోయినట్లేనని గ్రహించాలి.
● వెనుకబడిన సబ్జెక్టులు లేదా పాఠ్యాంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి అవసరమైతే అధ్యాపకులు, సీనియర్ల సూచనలు, సలహాలను తీసుకోవాలి.
● తొందరపాటు నిర్ణయాల వల్ల తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎంత క్షోభకు గురవుతారోనని ఒక్క క్షణం ఆలోచించాలి.
ఒత్తిడిలో ఉన్న పిల్లలను గుర్తించాలి
పరీక్షల్లో తప్పినంత మాత్రాన జీవితం ముగిసినట్లు కాదు. పరీక్ష తప్పిన విద్యార్థులు ఆత్మన్యూనతను వీడాలి. జరిగిన తప్పు పునరావృతం కాకుండా చూసుకోవాలి. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి. డిప్రెషన్‌లో ఉన్న పిల్లలు నిద్రాహారాలకు దూరంగా ఉంటారు. ఒంటరితనాన్ని కోరుకుంటారు. అటువంటి వారి పట్ల స్నేహపూర్వకంగా మెలగుతూ వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపాలి.
– డాక్టర్ సౌమ్య పసుపులేటి, మానసిక వైద్యురాలు, ఏరియా ఆస్పత్రి, అమలాపురం
తల్లిదండ్రులు ఇవి గుర్తుంచుకోవాలి
తమ పిల్లలు అనుకున్న మార్కులు సాధించలేదనో, పరీక్ష తప్పారనో వారిని మందలించొద్దు.
ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులతో పోల్చి అవహేళన చేయవద్దు.
ఫలితాల సమయంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.
ఫలితాలు ప్రతికూలంగా వస్తే వారు తీవ్ర నిరాశకు గురవుతారు. ఆ సమయంలో వారిని అక్కున చేర్చుకోవాలి. శ్రీజరిగిన పొరపాటు గురించి పిల్లలతో సున్నితంగా చర్చించి, మీకు మేమున్నామన్న భరోసాను ఇవ్వగలిగితే వారికి తిరుగేలేదు.

ముందున్నది బంగరు భవిత