చంద్రబాబు ఒత్తిడితోనే పిచ్చి ప్రేలాపనలు | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఒత్తిడితోనే పిచ్చి ప్రేలాపనలు

Published Tue, Apr 29 2025 12:18 AM | Last Updated on Tue, Apr 29 2025 12:18 AM

చంద్రబాబు ఒత్తిడితోనే పిచ్చి ప్రేలాపనలు

చంద్రబాబు ఒత్తిడితోనే పిచ్చి ప్రేలాపనలు

రావులపాలెం: జగన్‌ను తిట్టాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ఒత్తిడి కారణంగా మంత్రులు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్‌ ఆదివారం గోపాలపురంలో చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. తమ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరి కాదని అన్నారు. వాస్తవాలు మరచిపోయి మంత్రి సుభాష్‌ జగన్‌పై పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. జగ్గిరెడ్డి ఏమన్నారంటే..

● విశాఖలోని విలువైన భూములను 99 పైసలకే ఉర్సా కంపెనీకి ధారాదత్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఎకరం భూమి రూ.5 కోట్లని చెప్పిన చంద్రబాబు ఉర్సాకు 99 పైసలకే కట్టబెట్టడాన్ని బట్టి మతిస్థిమితం ఉందో లేదో అర్థం చేసుకోవచ్చు.

● 50 ఏళ్లు నిండిన బీసీలందరికీ పెన్షన్‌ ఇస్తామని ఎన్నికల్లో చెప్పారు. మంచి విమర్శ చేస్తే తీసుకుంటామని మీరన్నారు కదా! ఈ విషయంపై చంద్రబాబుతో మాట్లాడి ఎప్పుడిస్తారో చెప్పాలి.

● చంద్రబాబు గతంలో రూ.1,500 కోట్లతో అమరావతిలో తాత్కాలిక సచివాలయాన్ని వర్షపు నీరు లోపలకు వచ్చేలా కట్టారు. పక్క రాష్ట్రం తెలంగాణలో అప్పటి సీఎం కేసీఆర్‌ రూ.613 కోట్లతో శాశ్వత సచివాలయం నిర్మించారు. మళ్లీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక రూ.4,600 కోట్లతో పూర్తి స్థాయి సచివాలయం కడతామని చంద్రబాబు చెబుతున్నారు. ఇలా ప్రజల ధనాన్ని లూటీ చేయడంతో పాటు అప్పల ఊబిలోకి రాష్ట్రాన్ని తీసుకుపోవడం పిచ్చి పనులు అవునో కాదో చెప్పాలి.

● ప్రజల సొమ్ము రూ.40 కోట్లు ఖర్చు చేసి ఇటీవల దావోస్‌ వెళ్లిన తండ్రీకొడుకులు పెట్టుబడులు ఏం తెచ్చారో చెప్పాలి.

● గత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్మించిన మెడికల్‌ కాలేజీ, పోర్టులు, ప్రాజెక్టులను మళ్లీ ప్రారంభించారు. మంత్రి సుభాష్‌ అన్నట్లుగానే సినిమాటిక్‌గా ‘చెల్లికి మళ్లీ మళ్లీ పెళ్లి’ అనే తీరుగా చంద్రబాబు పాలన సాగుతోంది. కొత్తగా రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధీ చేయకుండా జగన్‌ చేసిన వాటినే మళ్లీ కొత్తగా చెప్పుకుంటున్నారు.

● నియోజకవర్గంలో అవినీతి పరాకాష్టకు చేరింది. ఇసుక, మట్టి కాకుండా, బ్యాంకర్ల వరకూ చిట్‌ఫండ్స్‌ వరకూ చేరింది. ఈ సెటిల్‌మెంట్లు, బి–ట్యాక్స్‌లు వేస్తున్నది ఎవరో చెప్పాలి.

● ఎక్కడ చూసినా కూటమి నాయకుల అవినీతే తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పనులు కనిపించడం లేదు.

● బీసీ కార్పొరేషన్‌ లోన్లు, ఇసుక, మట్టి, గిట్టుబాటు ధరలు, అమరావతి పేరిట నాలుగు లేన్ల రోడ్డుకు కిలోమీటరుకు రూ.62 కోట్లు ఖర్చు.. ఇలా అన్నింటా ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది.

● వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు కొత్తగా ఒక్క పింఛన్‌ కూడా ఇవ్వడం లేదు.

● రాష్ట్రంలో అన్ని నిత్యావసరాల ధరలు, పన్నులు, మద్యం, కరెంటు చార్జీలు ఇలా అన్నీ పెంచారు. తద్వారా వచ్చిన ఆదాయాన్ని తిరిగి ప్రజలకు ఇవ్వకుండా, ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయకుండా మోసం చేస్తున్నారు.

● ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తే వారిపై కేసులు పెడుతున్నారు. ప్రశ్నించడానికి వచ్చిన పవన్‌ కల్యాణ్‌ ఎక్కడున్నారో తెలియడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement