జిల్లాలో వాహనాల అమ్మకాలు ఏడాదికేడాది తగ్గుతున్నాయి. ముఖ్యంగా బైక్‌ల అమ్మకాలు పడిపోతున్నట్టు తెలుస్తోంది. మూడేళ్ల రికార్డులను పరిశీలిస్తే ఏటా రెండు వేల పైచిలుకు వాహనాల అమ్మకాలు తగ్గుతున్నట్లు స్పష్టమవుతోంది. బైక్‌ల అమ్మకాలు గణనీయంగా తగ్గగా.. ఆటోలు కొనుగోలు చేసేవారి సంఖ్య పెరుగుతుండడం గమనార్హం. కార్ల అమ్మకాలు పరవాలేదన్నట్లుగా ఉండగా.. వ్యవసాయానికి ఉపయోగపడే ట్రాక్టర్లు, ట్రాలీల అమ్మకాలు యథావిధిగా కొనసాగుతున్నాయి.
సాక్షి, కామారెడ్డి: వాహనాల రిటైల్ అమ్మకాలను రిజిస్ట్రేషన్ల ప్రాతిపదికగా లెక్కిస్తారు. జిల్లాలో టూ వీలర్లు, ప్రయాణికుల వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు రెండేళ్లుగా తగ్గుతూ వస్తున్నాయి. 2020–21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 18,352 వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. 2021–22 లో 15,722 వాహనాలు, 2022–23 లో 13,312 వాహనాల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. అంటే ఏటా 2 వేల పైచిలుకు అమ్మకాలు తగ్గుతున్నాయి.
ధరల పెరుగుదల ప్రభావం..
గతంలో బైక్‌ల అమ్మకాలు ఎక్కువగా ఉండేవి. వీటి ధరలు ఇటీవలి సంవత్సరాలలో గణనీయంగా పెరిగాయి. దీని ప్రభావం వాహనాల కొనుగోళ్లపై పడినట్లు తెలుస్తోంది. జిల్లాలో 2020–21 ఆర్థిక సంవత్సరంలో 14,318 వాహనాల రిజిస్ట్రేషన్లు జరగ్గా.. 2021–22 లో 12,290 కు తగ్గిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 9,539 వాహనాల రిజిస్ట్రేషన్లే జరగడం గమనార్హం. ధరలు పెరగడంతో చాలామంది కొత్త బైక్‌లను కొనుగోలు చేయకుండా.. సెకండ్ హ్యాండ్ బైక్‌లవైపు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతోంది. దీంతో బైక్‌ల అమ్మకాలు తగ్గినట్లు తెలుస్తోంది.
కార్ల అమ్మకాలు..
కోవిడ్ తర్వాత చాలామంది కార్ల కొనుగోళ్లపై ఆసక్తి చూపారు. దీంతో కార్ల అమ్మకాలలో కొంత వృద్ధి కనిపించింది. 2020 –21 ఆర్థిక సంవత్సరంలో 1,110 కార్ల రిజిస్ట్రేషన్ జరగ్గా.. 2021–22 లో 1,396 కి పెరిగింది. ఈసారి ఇప్పటివరకు 1,333 కార్ల రిజిస్ట్రేషన్లు రికార్డయ్యాయి. కొందరు కొత్త కార్ల వైపు మొగ్గు చూపుతుండగా.. చాలామంది సెకండ్ హ్యాండ్ కొనుగోలు చేస్తున్నారు.
ఆటో రిక్షాల అమ్మకాలలో వృద్ధి
కరోనా మూలంగా ఉపాధి అవకాశాలు దెబ్బతినడంతో చాలామంది ప్రత్యామ్నాయంగా ఆటో రిక్షాలు, ట్రాలీ ఆటోలు కొనుగోలు చేస్తున్నారు. 2020–21 లో 358(141 ఆటో రిక్షాలు, 217 గూడ్స్ క్యారేజీలు), 2021–22 లో 347(107 ఆటోరిక్షాలు, 240 గూడ్స్ క్యారేజీలు), 2022–23 లో 651(245 ఆటో రిక్షాలు, 406 గూడ్స్ క్యారేజీ)ల రిజిస్ట్రేషన్‌లు జరిగాయి.
టూ వీలర్.. ట్రాక్టర్లు, ట్రాలీలు..
జిల్లాలో వ్యవసాయ అవసరాల కోసం 2020–21 ఆర్థిక సంవత్సరంలో 794 ట్రాక్టర్లు, 435 ట్రాలీలు, 2021–22లో 537 ట్రాక్టర్లు, 257 ట్రాలీలు, 2022–23లో 452 ట్రాక్టర్లు, 136 ట్రాలీలు కొను గోలు చేశారు. కమర్షియల్ అవసరాల కోసం 2020–21లో 672 ట్రాక్టర్లు, 367 ట్రాలీలు, 2021–22లో 457 ట్రాక్టర్లు, 273 ట్రాలీలు, 2022–23 లో 547 ట్రాక్టర్లు, 180 ట్రాలీలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment