సాక్షి, కామారెడ్డి: ఆ ఊళ్లో ఒకరిని చూసి ఒకరు అన్నట్టుగా ఇప్పటికే 25 మంది సైన్యంలో అడుగుపెట్టారు. మరికొందరు అదే బాటలో సిద్ధమవుతున్నారు. ఆటల్లో ముందుండే తాడ్వాయి యువత దేశ సేవలోనూ ముందు వరుసలో నిలుస్తున్నారు. తాడ్వాయి మండల కేంద్రంలో యువతకు దేశభక్తి ఎక్కువ. దేశ సేవ కోసం వారు త్రివిధ దళాల్లో చేరుతున్నారు. ముఖ్యంగా ఆర్మీలో చాలా మంది చేరారు. సెలవుల్లో వచ్చినపుడల్లా గ్రామానికి చెందిన యువతకు సైన్యం గురించి అవగాహన కల్పిస్తున్నారు. దీంతో యువత సైన్యంలో చేరడానికి మరింత ఆసక్తి కనబరుస్తున్నారు. కాగా గ్రామానికి చెందిన రవీందర్‌రెడ్డి అనే సైనికుడు రెండేళ్ల నాడు చనిపోయాడు. ఆర్మీలో చేరేందుకు ఆసక్తి చూపే యువతను గ్రామానికి చెందిన సైనికులు ప్రోత్సహిస్తున్నారు.
త్రివిధ దళాల్లో..
తాడ్వాయి గ్రామానికి చెందిన యువకులు త్రివిధ దళాల్లో వివిధ స్థాయిల్లో పలు రాష్ట్రాల్లో విధులు నిర్వహిస్తున్నారు. జమ్మూకాశ్మీర్, పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం తదితర రాష్ట్రాల్లో వారు బాధ్యతలు నిర్వహిస్తూ దేశ రక్షణలో తమవంతు పాత్ర పోశిస్తున్నారు. వివిధ స్థాయిల్లో వారు పనిచేస్తున్నారు. అంతేగాక గ్రామానికి చెందిన పలువురు పోలీసు శాఖలోనూ ఉద్యోగాల్లో ఉన్నారు.
గ్రామం నడిబొడ్డున సుభాష్ చంద్రబోస్ విగ్రహం
తాడ్వాయికి చెందిన సైనికులంతా కలిసి గ్రామంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసి అందరికీ స్ఫూర్తిని నింపారు. అలాగే అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. యువతను ప్రోత్సహించేందుకు వారు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తాడ్వాయికి చెందిన విద్యార్థులు, యువకులు ఆటల్లో ఎంతో పేరు గడించారు. వారిలో చాలా మంది ఆర్మీలో, పోలీసు శాఖలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు.
గర్వంగా ఉంది..
నా కొడుకు సైన్యంలో చేరి దేశానికి సేవ చేస్తుండడం గర్వంగా అనిపిస్తుంది. మా గ్రామంలో యువకులు ఒకరిని నుంచి ఒకరు దేశ సేవకు అంకితమవుతున్నారు. నా కొడుకు సైన్యంలో చేరాలనుకున్నపుడు ప్రోత్సహించి పంపించాను. –తానయ్యోల బాపురావు, సైనికుడి తండ్రి, తాడ్వాయి
నేను పోలీసు కావాలనుకున్నా..
నాకు పోలీసు అవ్వాలని ఉండే. నేను కాలేకపోయా ను. నా కొడుకు సైన్యంలో చేరాడు. నా కోరిక నా కొడుకు రూపంలో తీరింది. దేశ సేవ కోసం సై న్యంలో చేరడాన్ని గొప్పగా ఫీలవుతాను. చాలా మంది యువకులు సైన్యంలో చేరుతున్నారు.
– ఆకిటి రాజిరెడ్డి, సైనికుడి తండ్రి, తాడ్వాయి
మా గ్రామానికే గర్వకారణం
మా గ్రామం నుంచి 25 మంది సైన్యంలో పనిచేస్తుండడం మాకెంతో గర్వంగా ఉంది. సై న్యంలో పనిచేస్తూనే గ్రామంలో సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. వారిని చూసి గ్రామం గర్వంగా ఫీలవుతుంది. వాళ్ల దారిలో చాలా మంది నడవడానికి ముందుకు వస్తున్నారు.
–సంజీవులు, సర్పంచ్, తాడ్వాయి
Comments
Please login to add a commentAdd a comment