కామారెడ్డి బరిలో కొత్త ప్రత్యర్థులు! | - | Sakshi
Sakshi News home page

కామారెడ్డి బరిలో కొత్త ప్రత్యర్థులు!

Published Mon, Nov 20 2023 1:16 AM | Last Updated on Mon, Nov 20 2023 1:34 PM

- - Sakshi

సాక్షి, కామారెడ్డి: దశాబ్దాలుగా ఆయా నియోజకవర్గాల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా పాతముఖాలే కనిపించేవి. గెలిచినా, ఓడినా వాళ్లే బరిలో ఉండేవారు. నువ్వా, నేనా అన్న రీతిలో తలపడేవారు. ఈసారి అందుకు భిన్నంగా పాత ప్రత్యర్థులు లేని ఎన్నికలు జరుగుతుండడం ప్రత్యేకతను సంతరించుకుంది. జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు మారారు. దీంతో కొత్త వారు ప్రత్యర్థులయ్యారు. కామారెడ్డి సీటు మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. సీఎం కేసీఆర్‌ కామారెడ్డి నుంచి పోటీ చేస్తుండడం, ఆయనపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పోటీకి దిగడంతో అందరి దృష్టి ఈ నియోజకవర్గంపైనే ఉంది. ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్‌లలోనూ కొత్త ప్రత్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

కామారెడ్డిలో చిరకాల ప్రత్యర్థులు లేకుండా..
కామారెడ్డి నియోజకవర్గంలో షబ్బీర్‌అలీ, గంప గోవర్ధన్‌ మూడు దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు. 1994లో తొలిసారి వీరిద్దరూ ప్రత్యర్థులుగా తలపడ్డారు. ఆ ఎన్నికల్లో గంప గోవర్ధన్‌ గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1999లో గంపకు టికెట్టు దక్కలేదు. 2004 లో బీజేపీతో పొత్తు తో గంప పోటీ చేసే అవకాశం కోల్పోయారు. 2009లో గంప, షబ్బీర్‌ పోటీ చేశారు. 2014, 2018 ఎన్నికల్లోనూ వీరిద్దరే ప్రధాన ప్రత్యర్థులు.. మూడు ఎన్నికలలోనూ గంపదే పైచేయి అయ్యింది. ఈసారీ వారే ప్రత్యర్థులుగా ఉంటారని మొదట భావించినా.. అనూహ్యంగా సీఎం కేసీఆర్‌ బరిలోకి రావడంతో గంప పోటీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇదే సమయంలో సీఎం మీద పోటీకి పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ముందుకు రావడంతో షబ్బీర్‌ అలీ సైతం సీటును త్యాగం చేసి, నిజామాబాద్‌ అర్బన్‌కు వలస వెళ్లాల్సి వచ్చింది. దీంతో మూడు దశాబ్దాల చరిత్రలో షబ్బీర్‌, గంప లేకుండా తొలిసారి కామారెడ్డి నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతున్నాయి.

బాన్సువాడలో పోచారం ఒక్కరే పాతకాపు...
బాన్సువాడ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. నియోజకవర్గంలో తిరుగులే ని నాయకుడిగా ఎదిగిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఈసారి కూడా బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2004లో కాంగ్రెస్‌ అభ్యర్థి బాజిరెడ్డి చేతిలో ఓటమి చెందిన పోచారం 2009, 2011(ఉప ఎన్నిక), 2014, 2018 ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధించారు. 2014, 2018 ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థిగా కాసుల బాల్‌రాజు కాంగ్రెస్‌ నుంచి పోటీ చేశారు. ఈసారి ఆయనకు కాంగ్రెస్‌ టికెట్టు కేటాయించలేదు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిని ఇక్కడినుంచి బరిలో దింపింది. అలాగే బీజేపీ అభ్యర్థిగా నిజామాబాద్‌ అర్బన్‌ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ పోటీలో ఉన్నారు. ఇక్కడ పోచారం ఒక్కరే పాత కాపు కాగా మిగతా ఇద్దరూ కొత్త వారే..

ఎల్లారెడ్డిలో జాజాల..
కామారెడ్డికి పొరుగునే ఉన్న ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఈసారి రాజకీయాల్లో అనేక మార్పులు సంభవించాయి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన జాజాల సురేందర్‌ కొంత కాలానికే గులాబీ కండువా కప్పుకున్నారు. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన ఏనుగు రవీందర్‌రెడ్డి 2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీలో ప్రాధాన్యత తగ్గడంతో బీజేపీలో చేరారు. అక్కడ ఇమడలేకపోయిన ఏనుగు ఇటీవల కాంగ్రెస్‌ కండువా కప్పుకుని ఎల్లారెడ్డి టికెట్టు కోసం ప్రయత్నించారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో జహీ రాబాద్‌ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చెందిన మదన్‌మోహన్‌రావు ఎల్లారెడ్డి టికెట్టు సాధించారు. దీంతో ఏనుగు రవీందర్‌రెడ్డికి ప్రత్యామ్నాయంగా బాన్సువాడ టికెట్టు ఇచ్చారు. గడచిన రెండు దశాబ్దాల కాలంలో ఎల్లారెడ్డి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ ఏనుగు పోటీ చేస్తూ వచ్చారు. నాలు గు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈసారి ఎల్లారెడ్డిలో ఆయన లేని ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ బీజేపీ నుంచి వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి బరిలో నిలిచారు.

జుక్కల్‌లో గంగారాం స్థానంలో తోట లక్ష్మీకాంతరావ్‌
జుక్కల్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే హన్మంత్‌సింధే బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా తిరిగి పోటీ చేస్తున్నారు. 2009, 2014, 2018 ఎన్నికల్లో వరుస విజయాలను సొంతం చేసుకున్న ఆయన ఈసారి కూడా విజయం సాధించాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా అరుణతార మళ్లీ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ మాత్రం అభ్యర్థిని మార్చింది. ఇక్కడినుంచి దశాబ్దాలుగా పోటీ చేస్తూ వస్తున్న మాజీ ఎమ్మెల్యే సౌదాగర్‌ గంగారామ్‌కు బదు లు తోట లక్ష్మీకాంతరావ్‌ను బరిలో నిలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement