ఆటో కోసమే స్నేహితుడి హత్య
ఖలీల్‌వాడి: జల్సాలకు అలవాటు పడిన ఓ వ్యక్తి సొంత స్నేహితుడినే ఆటో కోసం హత్య చేశాడు. ఘటనకు సంబంధించి ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి బుధవారం నగరంలోని ఏసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నగరంలోని నాగారం 80 క్వార్టర్స్‌కు చెందిన సతీశ్ గౌడ్ అలియాస్ బబ్లూకు 2010లో హైదరాబాద్‌కు చెందిన లావణ్యతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సతీశ్ మద్యానికి బానిస కావడంతో పాటు జల్సాలకు అలవాటుపడ్డాడు. అతని తీరు నచ్చక భార్య పిల్లలతో కలిసి ఐదేళ్ల క్రితం పుట్టింటికి వెళ్లింది. సతీశ్ గత మూడు నెలలుగా నాగారంలో ఉంటున్న తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడు. గతంలో సతీశ్ ఆటో నడుపుతున్న సమయంలో బ్రాహ్మణ కాలనీకి చెందిన కండెల సందీప్(28)తో పరిచయం ఏర్పడడంతో మిత్రులుగా మారారు. కొన్ని రోజులుగా వీరిద్దరు ఆటోలో కిరాయిలకు తిరుగుతున్నారు. జల్సాలకు అలవాటుపడ్డ సతీశ్ డబ్బుల కోసం దొంగతనం చేద్దామని అనుకుంటున్న సమయంలో సందీప్ ఆటోను కొనుగోలు చేశాడు. సందీప్ కొనుగోలు చేసిన ఆటోను, ఫోన్‌ను కాజేయాలని సతీశ్ పథకం రచించాడు. ఈ నెల 15న ఇద్దరు ఆటోలో కిరాయికి వచ్చిన డబ్బులతో పలుచోట్ల మద్యం సేవించారు. సందీప్ మత్తులో ఉన్నట్లు గుర్తించిన సతీశ్ కామారెడ్డికి కిరాయికి వెళ్దామని చెప్పి తీసుకెళ్లాడు. ఇందల్వాయి మండలం చంద్రాయన్‌పల్లి దాటిన తర్వాత మూత్రం పోసేందుకని ఇద్దరు రోడ్డుకు సమీపంలో ఉన్న చెరువు ప్రాంతానికి వెళ్లారు. ఈ క్రమంలో సందీప్ సతీశ్‌ను వెనుక నుంచి కిందికి నెట్టేసి బండరాయితో ఛాతి భాగంలో దాడి చేసి హత్య చేశాడు. మృతదేహం కనిపించకుండా ఉండేందుకు చుట్టుపక్కల ఉన్న కట్టెలు తెచ్చి దహనం చేసి ఆటోలో హైదరాబాద్‌కు వెళ్లాడు. ఈ నెల 16న సందీప్ కనిపించడం లేదంటు అతని భార్య లత స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి సెల్ డాటా ప్రకారం వివరాలు సేకరించారు. సందీప్ సెల్‌ఫోన్ నుంచి సిమ్ తీసేసిన సతీశ్ తన వద్ద ఉన్న సిమ్ వేయడంతో పోలీసులు నిందితుడిని గుర్తించారు. రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో తిరిగి జిల్లాకు వస్తున్న సతీశ్‌ను ఇందల్వాయి ప్రాంతంలో పోలీసులు పట్టుకున్నారు. అంతేకాకుండా నిందితుడు అనేక హత్య, దొంగతనాల కేసుల్లో నేరస్తుడని తెలిపారు. ఈ కేసును త్వరగా చేధించిన నార్త్ సీఐ బి శ్రీనివాస్, ఎస్సై ఎం గంగాధర్, సిబ్బందిని ఏసీపీ అభినందించారు.
ఇందల్వాయి అటవీ ప్రాంతంలో దహనం చేసిన మృతదేహం కేసును
చేధించిన పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment