సుభాష్‌నగర్: పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి బీజేపీ కార్యకర్త కర్తవ్యంగా భావించి పని చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ పిలుపు నిచ్చారు. బుధవారం రాత్రి నగర శివారులోని ఓ ప్రైవేట్ హోటల్ లో ఉమ్మడి నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్ష సమావేశం బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా సునీల్ బన్సల్, పార్టీ తెలంగాణ సంఘటన మంత్రి చంద్రశేఖర్ జీ, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ గ్రాడ్యుయేట్ ఎన్నికల బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, బీజేపీ, తపస్ బలపరిచిన టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్యను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభావిత ఓటర్లను గుర్తించి వారితో వ్యక్తిగతంగా పరిచయం పెంచుకోవాలన్నారు. ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలుసుకుని అభ్యర్థి గురించి అవగాహన కల్పించాలన్నారు.ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో పునరావృతం అవుతున్నాయని ఓటర్లకు తెలియజేయాలన్నారు. ఢిల్లీలో మొదలైన విజయం, గల్లీలో కా షాయ జెండా ఎగురవేసే వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అవిశ్రాంతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత ఎన్నికలు అంజిరెడ్డి, కొమరయ్యకు చెందినవి కావని, ఈ ఎన్నికలు ప్రతి బీజేపీ కార్యకర్త భవిష్యత్‌కు పునాది వేసే ఎన్నికలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలిస్తేనే, భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీకి బలమైన స్థానం ఏర్పడుతుందన్నారు.
ఈ ఎన్నికలో మనం విజయపథాన్ని అందుకోవాలంటే, ప్రతి కార్యకర్త బాధ్యతతో పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, నాయకులు పల్లె గంగారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌వీఎస్ ఎస్ ప్రభాకర్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
సునీల్ బన్సల్
Comments
Please login to add a commentAdd a comment