మత్తెక్కిస్తున్న దందా!
జిల్లాలో చాపకింద నీరులా గంజాయి దందా విస్తరిస్తోంది. పల్లె, పట్నం తేడాలేకుండా అంతటా గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పోలీసులు దాడులు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నా ఈ దందాకు అడ్డుకట్ట పడడం లేదు. యువత మత్తుకు బానిసగా మారి విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటోంది.
– కామారెడ్డి క్రైం
ఖాళీ ప్రదేశాలే అడ్డాలుగా..
జిల్లాలో టీ పాయింట్‌లు, ఖాళీ ప్రదేశాలు అడ్డాలుగా గంజాయి దందా నడుస్తోంది. ఇతర రాష్ట్రాలతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్ల రూపంలో తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. కొద్ది నెలల క్రితం లిక్విడ్ రూపంలో తయారు చేసి విక్రయిస్తున్న గంజాయి డబ్బాలను కామారెడ్డి పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గంజాయి సరఫరాపై ఉక్కుపాదం మోపాలని భావించి అధికార యంత్రాంగానికి సూచనలు చేసింది. అప్పటి నుంచి జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయి సరఫరా, విక్రయాలు, సేవనంపై పోలీసు, ఎక్సైజ్ శాఖలు ప్రత్యేక నిఘా పెట్టాయి. తనిఖీలు, దాడులు పెరిగాయి. కేసులూ నమోదు చేస్తున్నారు. కానీ గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సేవనం, విక్రయాలు సాగుతూనే ఉన్నాయి. ఈ వ్యవహారంలో సంబంధిత శాఖలు మరింత కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.
● విస్తరించిన
గంజాయి సామ్రాజ్యం
● జిల్లాలో జోరుగా
విక్రయాలు
● బానిసలుగా
మారుతున్న యువతరం
● దాడులు చేస్తున్నా తగ్గని స్మగ్లర్లు
జిల్లాలో గతంలో గంజాయి వ్యాపారం మాత్రమే సాగేది. ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల సరిహద్దు గ్రామాల నుంచి వరంగల్ మీదుగా జిల్లాకు తెచ్చి గాంధారి, లింగంపేట, బాన్సువాడ ప్రాంతాల్లో డంప్ చేసేవారు. అదును చూసుకుని మహారాష్ట్రలోని ముంబయి, పుణే లాంటి ప్రాంతాలకు సరఫరా చేసేవారు. కానీ కొన్నేళ్లుగా జిల్లాలోనూ గంజాయి విక్రయాలు సాగుతున్నాయి. మత్తుకు బానిసలవుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. పట్టణాలు, మండల కేంద్రాల్లోనే కాదు చివరకు గ్రామాల్లో కూడా చాలామంది యువకులు గంజాయి సేవనానికి అలవాటు పడినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలో గంజాయి వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. ప్రధానంగా యువతరం గంజాయికి అలవాటు పడి కెరీర్‌ను నాశనం చేసుకుంటున్నారు. కెరీర్ దెబ్బతినడంతోపాటు ఆరోగ్య సమస్యలూ ఎదురవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment