ఒత్తిడిలో విద్యార్థులు
● మార్కుల వేటలో
పెరుగుతున్న ఆందోళన
● ఆత్మవిశ్వాసం కల్పించాలంటున్న మానసిక నిపుణులు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: మార్కుల వేటలో విద్యార్థులు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా భవిష్యత్తును నిర్దేశించే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలన్న ఆరాటం వారిని తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తోంది. బోర్డ్ ఎగ్జామ్స్ వస్తున్నాయంటే సహజంగానే విద్యార్థులు ఒత్తిడికి గురవుతుంటారు. దీనికితోడు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధ్యాపకుల నుంచి ఒత్తిడి ఉండనే ఉంటుంది. కొందరు విద్యార్థులు నిర్భయంగా పరీక్షలు రాయడానికి ప్రిపేర్ అవుతుండగా, చాలా మంది తాము ప్రిపేర్ అయిన ప్రశ్నలు రాకుంటే మార్కులు తగ్గుతాయేమోననే భయంతో వణికిపోతుంటారు. పిల్లల్లో ధైర్యం నింపడానికి ఉపాధ్యాయులు ప్రయత్నాలు చేస్తున్నా కొందరు మాత్రం పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ భయంతోనే గడుపుతుంటారు. ఈ తరుణంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు వారికి అండగా నిలవాలి. వారిలో ధైర్యాన్ని నింపాలి. అన్నింటికంటే ముఖ్యంగా వారిపై వారికి ఆత్మవిశ్వాసం కల్పించాలి. ఎంత చదవగలిగితే అంత చదువు, టెన్షన్ అవసరం లేదు, మార్కులు కొలమానం కానేకాదని వారికి నచ్చజెప్పాలి తప్ప, వేరే వాళ్ల పిల్లలతో పోల్చే ప్రయత్నం చేయొద్దు. అలా చేయడం వల్ల విద్యార్థులు మరింత ఒత్తిడికి లోనవుతారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు మానసిక స్థైర్యాన్ని కలిగించే ప్రయత్నాలు జరగాల్సిన అవసరం ఉంది.
మార్చి 5 నుంచి పరీక్షలు..
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు వచ్చే నెల 5 నుంచి మొదలై 25 వరకు కొనసాగుతాయి. జిల్లాలో మొదటి సంవత్సరం పరీక్షలకు 8,743 మంది విద్యార్థులు, రెండో సంవత్సరం పరీక్షలు 9,729 మంది విద్యార్థులు రాయనున్నారు. అలాగే జిల్లాలో పదో తరగతి పరీక్షలకు 12,579 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇప్పటికే సిలబస్ పూర్తి చేయడంతో పాటు రివిజన్ కూడా జరిగింది. ప్రిఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పిల్లలకు ప్రత్యేక క్లాసులు జరుగుతున్నాయి. రాత్రింబవళ్లూ చదువుతున్నారు.
ఆందోళన అధిగమిస్తేనే విజయం..
పరీక్షలు అనే సరికి విద్యార్థుల్లో రకరకాల ఆందోళనలు వస్తాయి. కొన్ని వారిని తీవ్రంగా వేదనకు గురిచేస్తాయి. ఈ తరుణంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు వారికి అండగా నిలవాలి. ఆందోళన అధిగమిస్తే విజయం సొంతమవుతుందన్న విషయాన్ని వారికి విడమర్చి చెప్పాలి. నిరంతరం చదువు మీద తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఒత్తిడి పెట్టకుండా ఉండాల్సిన అవసరమూ ఉంది.
ప్రస్తుత చదువులు మార్కులే కొలమానంగా సాగుతున్నాయి. విద్యార్థులు పోటీపడి మార్కులు తెచ్చుకుంటున్నారు. చదువులు, పరీక్షల సమయంలో కొందరు తీవ్ర ఒత్తిడికి గురవుతూ మానసికంగా కుంగిపోతున్నారు. దీంతో ఆరోగ్యమూ దెబ్బతింటోంది. మార్కులు తక్కువ వచ్చాయనో, ఫెయిల్ అయ్యామనో ఆవేదనకు గురై కొందరు ఆత్మహత్యలకు పాల్పడి తల్లిదండ్రులకు మనోవేదన మిగుల్చుతున్నారు.
మానసిక స్థైర్యాన్ని నింపాలి
పరీక్షలు అనగానే సహజంగానే విద్యార్థులకు భయం ఉంటుంది. భయాన్ని తొలగించే ప్రయత్నం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి రావాలి. ప్రస్తుత విద్యావ్యవస్థలో ఉన్న ఒత్తిడి వల్ల పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు. వారిని జాగ్రత్తగా గమనించాలి. మానసిక స్థైర్యాన్ని ఇవ్వడం ద్వారా వారు ధైర్యంగా పరీక్షలు రాయడానికి సమాయత్తమవుతారు. ఆ దిశగా ప్రయత్నించాలి. – సి.వీరేందర్, సైకాలజిస్ట్
అందరిలో మార్పు రావాలి
ఇప్పుడందరి ఆలోచన తన బిడ్డ టాప్‌లో నిలవాలన్నదే. పిల్లల మానసిక పరిస్థితిని చూడటం లేదు. ఇతరుల పిల్లల మాదిరిగా తమ పిల్లలు చదవాలనే పట్టుదలకు పోతున్నారు. మార్కుల కన్నా జ్ఞానం అవసరం అన్న విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలి. చదువు విషయంలో వారికి ధైర్యమివ్వాలే తప్ప వారిపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేయొద్దు.
– జి.లచ్చయ్య, రిటైర్డ్ డైట్ లెక్చరర్
ఒత్తిడిలో విద్యార్థులు
ఒత్తిడిలో విద్యార్థులు
Comments
Please login to add a commentAdd a comment