
అత్తింటి వేధింపులకు వివాహిత బలి
బోధన్‌టౌన్(బోధన్): అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధింపులకు గురిచేయగా, ఓ వివాహిత ఆత్మహత్యకు యత్నించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. పట్టణంలోని ధ్యాకం గల్లీకి చెందిన జమేదార్ సాయిలుకు రెంజల్ మండలం బాగెపల్లి గ్రామానికి చెందిన రజితతో 15ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి సాహితి, శ్రీనిధి ఇద్దరు కూతుళ్లు ఉన్నారన్నారు. ఇటీవల భర్త సాయిలు, అత్తలు లక్ష్మి, నాగమణి, బావ నగేష్, మరిది రాజా అదనపు కట్నం కోసం రజితను వేధించారు. దీంతో ఆమె తండ్రి సాయిలు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి సముదాయించారు. కానీ వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడంతోపాటు మళ్లీ అదనపు కట్నం కోసం వేఽధించగా రజిత ఈనెల 24న రాత్రి ఇంట్లో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే మంటలు చెలరేగడంతో భర్త, స్థానికులు ఆమెను బోధన్‌లోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఆమె గురువారం మృతి చెందింది. మృతురాలి తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు అత్తింటి వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెంకట నారాయణ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment