రుణ లక్ష్యాలను చేరుకోవాలి
కామారెడ్డి క్రైం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి వివిధ అంశాల్లో లక్ష్యానికి అనుగుణంగా అర్హత గల వారికి రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ బ్యాంకర్లకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో వివిధ బ్యాంకుల అధికారులు, మేనేజర్లు, ప్రభుత్వ శాఖల అధికారులతో రుణాల మంజూరు, లక్ష్యాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంట, వ్యవసాయ అనుబంధ రుణాలు, ఎంఎస్‌ఎంఈ, హౌసింగ్, విద్య రుణాల లక్ష్యాలను చేరకోవాలన్నారు. ప్రాధాన్యత రంగాలకు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా రుణాలను మంజూరు చేయాలని సూచించారు. అనంతరం వచ్చే ఆర్థిక సంవత్సరానికి నాబార్డ్ సిద్ధం చేసిన యాక్షన్ ప్లాన్ ప్రతులను ఆవిష్కరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, నాబార్డ్ డీడీఎం ప్రవీణ్, ఆర్బీఐ ఏజీఎం పృథ్వీ, ఎల్‌డీఎం రవికాంత్, డీఆర్‌డీవో సురేందర్, మోడల్ సీఎస్‌సీ రాష్ట్ర ప్రాజెక్ట్ మేనేజర్ హరికృష్ణ కుమార్, జిల్లా మేనేజర్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
నీటి ఎద్దడి నివారణకు చర్యలు
కామారెడ్డి క్రైం: జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేశామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై గ్రామాలలో తాగు నీటి సమస్యపై చర్చించారు. తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మిషన్ భగీరథ ఈఈ, జిల్లా పంచాయతీ అధికారుల ప్రతిపాదనల మేరకు తొలి విడతలో జిల్లావ్యాప్తంగా 125 గ్రామాల్లో రూ. 1.18 కోట్ల అంచనాలతో పనులు చేపట్టడానికి నిధులు మంజూరు చేశామన్నారు. ఈ నిధులతో తాగునీటి వనరుల మరమ్మతులు, బోరు బావుల తవ్వకం, పైప్‌లైన్‌లు తదితర పనులు చేపడతామని పేర్కొన్నారు. ఎక్కడైనా తాగు నీటి ఇబ్బందులు తలెత్తితే అవసరమైన పనులకోసం ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో మిషన్ భగీరథ ఈఈ రమేశ్, డీపీవో మురళి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కలెక్టరేట్‌లో బ్యాంకర్లతో సమావేశం
యాక్షన్ ప్లాన్ పోస్టర్ల ఆవిష్కరణ
Comments
Please login to add a commentAdd a comment