నాగిరెడ్డిపేట: అర్హులైనవారి పంట రుణాలను మాఫీ చేయాలని తాండూర్ సహకార సంఘం మహాజనసభలో రైతులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మండలంలోని తాండూర్ సహకార సంఘం చైర్మన్ గంగారెడ్డి అధ్యక్షతన మహాజనసభను నిర్వహించారు. ఈ సందర్భంగా సహకార సంఘం ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలను సీఈవో చంద్రమురళి చదివి వినిపిస్తుండగా రైతులు అడ్డుకొని తమకెందుకు రుణమాఫీ కాలేదని ప్రశ్నించారు. సహకార సంఘం పరిధిలో అర్హులైన ప్రతిఒక్కరికీ రుణమాఫీ చేయాలన్నారు. ఇప్పటివరకు సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగిన తాండూర్, జలాల్‌పూర్ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండల సమాఖ్యకు అప్పగించడాన్ని సభ్యులు వ్యతిరేకించారు. దీనిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామని చైర్మన్ తెలిపారు. కార్యక్రమంలోసంఘం వైస్‌చైర్మన్ బాబురావు, మాజీ ఎంపీపీ రాజ్‌దాస్, నాయకులు సంజీవులు తదితరులు పాల్గొన్నారు.