లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని అయిలాపూర్ గ్రామంలో ఓ వివాహిత అత్తింటి వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఏఎస్సై ప్రకాష్‌నాయక్ తెలిపిన వివరాలు ఇలా.. అయిలాపూర్ గ్రామానికి చెందిన గుడ్డోళ్ల సులోచన(32)కు 2018లో కొర్పోల్ గ్రామానికి చెందిన కుమార్‌తో వివాహం జరిగింది. వీరికి అభినయ్, దీక్షిత ఇద్దరు పిల్లలు. వీరు బతుకుదెరువు కోసం కొన్ని నెలల క్రితం హైదరాబాదుకు వెళ్లగా ఇటీవల కొర్పోల్ గ్రామానికి వచ్చారు. ఈక్రమంలో అత్త గంగవ్వ, ఆడపడుచు సాయవ్వ, భర్త కుమార్, బావ రవి, తోటి కోడలు లలిత కలిసి సులోచనను మానసికంగా వేధింపులకు గురిచేసేవారు. ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పగా పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి సర్దిచెప్పి పంపించారు. అయినప్పటికీ వేధింపులు కొనసాగుతుండటంతో అయిలాపూర్‌లోని తల్లిగారింటికి వచ్చేసింది. ఈక్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. మృతురాలి తండ్రి బాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.