● కూతురు మృతి, తండ్రికి తీవ్రగాయాలు
నిజాంసాగర్(జుక్కల్): నాందేడ్ – సంగారెడ్డి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. పిట్లం మండలం కంభాపూర్ గ్రామానికి చెందిన ఇప్ప సత్యవ్వ– సాయిలు దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. సాయిలు కంభాపూర్ జీపీలో ఫిట్టర్‌మన్‌గా పనిచేస్తున్నాడు. పెద్ద కూతురు విజయలక్ష్మి(12) సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గం బీసీ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. సాయిలు బైక్‌పై అల్లాదుర్గానికి వెళ్లి.. కూతురుని తీసుకొని కంభాపూర్‌కు వస్తున్నాడు. నిజాంసాగర్ మండలం మంగ్లూర్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై బొలెరో వాహనం రాంగ్ రూట్‌లో వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో తండ్రీకూతుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. హైవే అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలిస్తుండగా విజయలక్ష్మి మృతి చెందింది. సాయిలు చికిత్స పొందుతున్నాడు. నిజాంసాగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.