కామారెడ్డి క్రైం: దోమకొండ మండలం చింతమాన్‌పల్లి శివారులో గురువారం వేకువజామున ఈరబోయిన రమేష్ (38)అనే వ్యక్తి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో అతడిని తీవ్రంగా కొట్టి హత్య చేసిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కామారెడ్డి డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి వివరాలు వెల్లడించారు. ముత్యంపేట గ్రామానికి చెందిన రమేష్ తన కారును డిసెంబర్‌లో రూ.3.85 లక్షలకు చింతమాన్‌పల్లికి చెందిన పల్లె పోచయ్యకు విక్రయించాడు. కారుపై తీసుకున్న లోన్‌కు సంబంధించిన వాయిదాలు, మిగిలిన డబ్బుల చెల్లింపుల విషయంలో ఇదివరకే పలుసార్లు ఇరువురి మధ్య గొడవ జరిగింది. రమేష్ గురువారం వేకువజామున చింతమాన్‌పల్లి శివారులో పోచయ్య నిర్వహిస్తున్న ఇటుకబట్టీ వద్దకు వెళ్లి తన కారును తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు. అక్కడే నిద్రపోతున్న పోచయ్య లేచి రమేష్‌ను అడ్డుకున్నాడు. పోచయ్య అతని బంధువు హరి, ఇటుక బట్టీలో పనిచేసే కూలీలు రమేష్, రాజు, బిదేశీ నాయక్‌లు కలిసి రమేష్‌పై కర్రలతో దాడి చేసి తీవ్రంగా కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు రమేష్‌ను కామారెడ్డి జనరల్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుని భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితులను పట్టుకొని రిమాండ్‌కు తరలించామన్నారు.