
వేర్వేరు చోట్ల్ల ముగ్గురి మృతి
ఉమ్మడి నిజామాబాద్‌లో జిల్లాలో గురువారం వేర్వేరు చోట్ల ముగ్గురు మృతి చెందారు. చేపలు పట్టేందుకు వెళ్లి ఇద్దరు, గోదావరిలో పడి మరొకరు మృతి చెందగా పోలీసులు కేసు నమోదు చేశారు.
నస్రుల్లాబాద్: చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ వ్యక్తి నీట మునిగి మృతి చెందినట్లు ఎస్సై లావణ్య తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. బాన్సువాడ మండలం కొల్లూరు గ్రామానికి చెందిన జరపాటి అశోక్(19) అనే యువకుడు నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలో ఉన్న రెడ్డి చెరువులో చేపలు పడుతుండగా బుధవారం ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. గురువారం చెరువులో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమచారం అందించారు. మృతుడి అన్న సాయికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
ఎల్లారెడ్డిలో..
ఎల్లారెడ్డి: చేపలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తి మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డి మండలం జాన్కంపల్లి ఖుర్దు గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జన్పుల నారాయణ (56) గురువారం సాయంత్రం గ్రామ శివారులోని తాటివాని మత్తడి చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. చెరువులో ఉన్న వల కాలికి తట్టడంతో నీట మునిగి మృతి చెందాడు. గమనించిన స్థానికులు అతడిని బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
గోదావరిలో పడి కూలీ..
నవీపేట: మండలంలోని నాళేశ్వర్ గ్రామానికి చెందిన గోనెవార్ గంగాధర్(49) కాలుజారి గోదావరి నదిలో పడి గురువారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. వ్యవసాయ కూలీ పనులకు వెళ్లిన గంగాధర్ బోరు మోటారు పని చేయకపోవడంతో గోదావరి నది ఒడ్డున ఉన్న మోటారు వద్దకు వెళ్లాడని పేర్కొన్నారు. మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి గోదావరి నదిలో పడి మృతి చెందాడు. భార్య చాయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
అనుమానాస్పద స్థితిలో మహిళ..
ఎడపల్లి: అనుమానాస్పద స్థి తిలో మహిళ మృతి చెందిన ఘటన ఎడపల్లి మండలం జైతాపూర్‌లో గురువారం చో టు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పురిమేటి లక్ష్మి(35) అనే మహిళ ఈ నెల 1న నిజామాబాద్‌కు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి తిరిగి రాలేదు. కుటుంబీకులు ఆమె కోసం వెతుకుతుండగా గ్రామ సమీపంలోని పంట కాలువలో ఆమె విగతజీవిగా కనిపించింది. మృతురాలి అన్న నాగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.