
మహిళల చేతికి ధాన్యం కొనుగోలు కేంద్రాలు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో మహిళలను ప్రోత్సహిస్తోంది. మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా సంఘాలకు ఇప్పటికే సోలార్ పవర్ యూనిట్లను, ఆర్టీసీ హైర్ బస్సులు, పెట్రోల్ బంకులు, క్యాంటీన్లతోపాటు మరెన్నో భారీ అవకాశాలు కల్పిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల్లో 99శాతం మంది సభ్యులు వ్యవసాయ కుటుంబాలకు చెందిన మహిళలే ఉంటారు. వారికి వ్యవసాయంపై పూర్తి అవగాహన ఉంటుంది. ఈ కారణంగా కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకు కేటాయిస్తున్నారు. గతంలో జిల్లాలో కేవలం 27 కేంద్రాలు మాత్రమే మహిళలకు కేటాయించగా, ఇప్పుడు ఏకంగా 180 కొనుగోలు కేంద్రాలను అప్పగించారు. జిల్లాలో 427 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా అందులో 180 కేంద్రాలను మహిళలు నిర్వహించనున్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో మహిళా సంఘాలకు కేంద్రాలను అప్పగించారు. ఈ సారి కొనుగోలు కేంద్రాల నిర్వహణలో మహిళల పాత్ర భారీగా పెరిగింది. మహిళా సంఘాలు అన్నింటా సక్సెస్ అవుతున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలోనూ విజయం సాధిస్తారని అధికారులు అంటున్నారు.
మహిళా సంఘాల ప్రతినిధులకు శిక్షణ
కామారెడ్డి క్రైం: యాసంగి సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లపై కామారెడ్డి మండల సమాఖ్య కార్యాలయంలో మహిళా సంఘాల ప్రతినిధులకు గురువారం శిక్షణ ఇచ్చారు. మండలంలోని తిమ్మక్‌పల్లి(కె), కోటాల్‌పల్లి, క్యాసంపల్లి తండా, రాఘవపూర్, గూడెం గ్రామాల్లో మహిళా సంఘాలకు కొనుగోలు కేంద్రాలు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. శిక్షణ కార్యక్రమంలో డీపీఎం రమేశ్‌బాబు మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను అప్పగించాలని నిర్ణయం తీసుకుందన్నారు. ఎలాంటి సమస్యలు రాకుండా ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. ఐకేపీ ఏపీఎంలు మోయిజ్, శ్రీనివాస్, వ్యవసాయ విస్తీర్ణాధికారులు, మహిళా సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో 180 కేంద్రాలు అప్పగింత