
అసంపూర్తిగా జెడ్పీ పాఠశాల భవన నిర్మాణం
ఎల్లారెడ్డిరూరల్: మన ఊరు మనబడి పథకం కింద పాఠశాలలకు నిధులు మంజూరైన అవి పూర్తి స్థాయిలో పనులు కాక పోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఎల్లారెడ్డి మండలం మాచాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు విద్యా బోధన కొనసాగుతున్నది. పాఠశాలలో 80 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరికి 5 తరగతి గదులు, ప్రిన్సిపల్ గదితో కలిపి ఆరు గదులు అవసరం ఉంది. పురాతన భవనం శిథిలావస్థకు చేరడంతో దానిని కూల్చి వేశారు. పాఠశాలకు గత రెండేళ్ల క్రితం మన ఊరు మన బడి పథకం కింద రూ. 80 లక్షలతో ఆరు తరగతి గదుల నిర్మాణం కోసం నిధులు మంజూరయ్యాయి. ఈనిధులతో కాంట్రాక్టర్ జీ ప్లస్ వన్‌లో భవనం నిర్మాణం చేయాలి. గ్రౌండ్ ఫ్లోర్‌లో నాలుగు తరగతి గదులు, ఫస్ట్ ఫ్లోర్‌లో రెండు తరగతి గదులు నిర్మించాలి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్‌కు సంబంధించి స్లాబ్ మాత్రమే వేసి పనులను నిలిపి వేశారు. ప్రాథమిక పాఠశాలకు చెందిన రెండు తరగతి గదులలో జెడ్పీ పాఠశాలకు సంబంధించిన రేకుల షెడ్డులో రెండు తరగతులు, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భవనం కింద ఒక తరగతిని నిర్వహిస్తున్నారు. సరిపడా గదులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలకు సంబంధించిన భవన నిర్మాణ పనులు ఆగిపోవడంతో విద్యార్థులు ఇరుకు గదులలో చదువుకుంటున్నారు. అధికారులు స్పందించి పాఠశాలకు సంబంధించిన పనులు త్వరగా పూర్తి చేయాలని విద్యార్థులు, వారి తల్లితండ్రులు కోరుతున్నారు.
మాచాపూర్‌లో సరిపడా
లేని తరగతి గదులు
ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు