
శత శాతానికి అడుగుదూరంలో..
కామారెడ్డి రూరల్: ప్రజలు చెల్లించే పన్నుల ఆధారంగా గ్రామాలు సమగ్రాభివృద్ధి చెందుతాయి. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న 14వ ఆర్థిక సంఘం నిధులు, ఎస్‌ఎఫ్‌సీ నిధులతోపాటు గ్రామాల్లో ఇంటి పన్నులతోపాటు వాణిజ్య సముదాయాలు చెల్లించే పన్నులు కీలకంగా మారాయి. ప్రజలకు వసతులు కల్పించాలంటే ఇందుకు అవసరమైన నిధుల కోసం గ్రామల్లో ప్రతి సంవత్సరం ఇంటి పన్ను వసూలు చేస్తారు. ఇంటి పన్ను వందశాతం వసూలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆయా మండలాల్లోని గ్రామాల్లో అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందితో ఇంటింటికి తిరుగుతూ ఇంటి పన్ను వసూలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 98.06 శాతం పన్ను వసూలైందని అధికారులు తెలిపారు.
ఇంటింటికి తిరుగుతూ..
పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వ నిధులతోపాటు పన్నులే ప్రధాన ఆదాయ వనరు. గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు, వీధిదీపాల నిర్వహణకు పన్నుల రూపంలో వచ్చిన నిధులను ఖర్చు చేస్తారు. వందశాతం పన్నుల వసూలుకు జిల్లా స్థాయి అధికారులు తరుచూ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయి సమస్యలు తెలుసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ కూడా పంచాయతీలు, మున్సిపాలిటిల్లో పన్నుల వసూలుపై దృష్టి సారించారు. సర్పంచులు పదవీకాలం ఉండగా పంచాయతీ కార్యదర్శులతో కలిసి గృహాలవారిగా తిరుగుతూ పన్నులు వసూలుకు చర్యలు చేపట్టేవారు.
ప్రత్యేకాధికారుల పాలనలో....
సర్పంచుల పదవీకాలం ముగిసి..ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతున్న ఈ సమయంలో పంచాయతీల్లో పన్నుల వసూలుకు గడువు ముగిసింది. 2024–2025 ఆర్థిక సంవత్సరం ముగిసి వారం రోజులు గడుస్తుండడంతో అధికారులు వందశాతం లక్ష్యం చేరుకోవడంపై దృష్టి సారించారు. , మరో వారం రోజుల్లో లక్ష్యాన్ని చేరుకుంటామని సంబంధిత అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
వందశాతం వసూలు చేస్తాం
గ్రామ పంచాయతీల్లో 100 శాతం పన్నులు వసూలు చేస్తాం. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే పన్నుల రూపంలో వచ్చిన నిధులతో అభివృద్ధి పనులు చేపట్టవచ్చని గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నాం. అంతేకాకుండా గ్రామ కార్యదర్శులు, సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ పన్నుల వసూలుకు కృషి చేస్తున్నారు. వారం రోజుల్లో 100 శాతం పన్నుల వసూలు లక్ష్యాన్ని చేరుకుంటాం.
– మురళి, డీపీవో, కామారెడ్డి
జీపీలు పన్ను వసూలు లక్ష్యం వసూలైంది శాతం వసూలు కావాల్సింది
536 రూ. 14,67,69,766 రూ.14,49,82,541 98.69 రూ. 17,87,225
98శాతం ఇంటి పన్ను వసూలు
లక్ష్యాన్ని పూర్తి చేయడంపై
దృష్టి సారించిన అధికారులు

శత శాతానికి అడుగుదూరంలో..