
కామారెడ్డిలో ఒకరి ఆత్మహత్య
కామారెడ్డి క్రైం: జిల్లాకేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. కాలనీకి చెందిన బోదాసు రాజు (35) కూలీ పని చేసుకుంటూ జీవించేవాడు. అతడికి లక్ష్మీతో 13 ఏళ్ల క్రితం వివాహం జరుగగా, ఇద్దరు సంతానం ఉన్నారు. దంపతుల మధ్య గొడవలు జరుగడంతో లక్ష్మి కొద్దిరోజులుగా తన తల్లిగారింటి వద్దనే ఉంటోంది. దీంతో రాజు మద్యానికి బానిసై, భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపం చెందేవాడు. ఈక్రమంలో ఆదివారం అర్ధరాత్రి అతడు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం కుటుంబ సభ్యులు అతడిని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి అన్న యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్‌హెచ్‌వో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి..
కామారెడ్డి క్రైం: రైలు కింద పడి ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన వడియారం– మిర్జాపల్లి రైల్వే స్టేషన్‌ల మధ్య ప్రాంతంలో సోమవారం ఉదయం వెలుగుచూసింది. పట్టాలపై మృతదేహం పడి ఉందని సమాచారం రావడంతో కామారెడ్డి రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుడి ఎడమ చేతికి వెండి కడియం, ఛాతిపై కుడి వైపున పుట్టు మచ్చ ఉన్నాయని రైల్వే పోలీసులు తెలిపారు. ఆనవాళ్లు తెలిసిన వారు కామారెడ్డి రైల్వే పోలీసులను సంప్రదించాలని, కేసు విచారణ అధికారి హన్మాండ్లు కోరారు.