
‘కల్తీ కల్లు బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’
బాన్సువాడ : కల్తీ కల్లు విక్రయిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ బీబీ పాటిల్ డిమాండ్ చేశారు. బుధవారం బాన్సువాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కల్తీ కల్లు బాధితులను ఆయన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుర్కి, అంకోల్, దామరంచ గ్రామాలకు చెందిన పలువురు కల్తీ కల్లు సేవించి అస్వస్థతకు గురయ్యారని, వైద్యులు ఎప్పటికప్పుడు చికిత్సలు అందించడంతో ప్రస్తుతం బాధితులు కోలుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పర్యవేక్షణ లోపంతోనే కల్లులో ప్రమాదకరమైన ఆల్ప్రాజోలంను అధిక మోతాదులో కలిపి విక్రయిస్తున్నారని ఆరోపించారు. సంబంధిత శాఖ అధికారులు కల్తీ కల్లు బాధ్యులపై ఏ విధమైన చర్యలు చేపట్టారో తెలపాలన్నారు. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రాజు, నాయకులు చీదరి సాయిలు, దొరబాబు తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడ: నస్రుల్లాబాద్ మండలంలోని దుర్కి, అంకోల్ గ్రామాల్లో కల్తీ కల్లు కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు బాన్సువాడ రూరల్ సీఐ రాజేశ్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కల్లులో ఆల్ప్రాజోలం అనే మత్తు పదార్థం కలపడం వల్ల 69 మంది ఆస్పత్రి పాలయ్యారన్నారు. ఈ కల్లు విక్రయించిన కేసులో దుర్కి గ్రామానికి చెందిన లక్ష్మాగౌడ్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తించామన్నారు. నిందితుడిని జుడీషియల్ రిమాండ్‌కు తరలించామన్నారు. ఆయన వెంట ఎస్సై లావణ్య, కానిస్టేబుల్స్ శ్రీనివాస్, హరిచంద్ పాల్గొన్నారు.
ఒకరి రిమాండ్

‘కల్తీ కల్లు బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’