
27న ఆర్యసమాజం స్వర్ణోత్సవ యాగం
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి ఆర్య సమాజం 50వ వార్షికోత్సవం సందర్భంగా ఈనెల 27న స్థానిక శ్రీసరస్వతి విద్యామందిర్ హైస్కూల్ ఆవరణలో 108 యజ్ఞకుండాలతో గాయత్రి మహాయాగం నిర్వహించనున్నారు. ఈ విషయాని ఆర్యసమాజం అధ్యక్షుడు కిషన్, కార్యదర్శి అరుణ, ప్రతినిధులు సత్యమిత్ర ఆర్య, రమేష్ తెలిపారు. స్వర్ణోత్సవాలలో ముఖ్యవక్తగా కోల్‌కతాకు చెందిన మహేంద్రపాల్ ఆర్య పాల్గొంటారని పేర్కొన్నారు. ఉత్సవాలలో ప్రజలు పాల్గొనాలని కోరారు.
టీచర్ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి
కామారెడ్డి అర్బన్: ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, ఇష్టారాజ్యంగా పుట్టుకొస్తున్న ప్రయివేట్ బడుల అనుమతులను నియంత్రించాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య జిల్లా శాఖ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సమాఖ్య జిల్లా చైర్మన్ ప్రవీణ్‌కుమార్ అధ్యక్షతన ఆదివారం జిల్లాకేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించి తీర్మానాలు చేశారు. డీఎస్సీ –2008 ఉపాధ్యాయుల వేతనాలతోపాటు పెన్షనర్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సమాఖ ప్రతినిధులు దేవులా, రాజ్‌కుమార్, హన్మంతురెడ్డి, గఫూర్ శిక్షక్, ముజీబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
జొన్న కొనుగోలు
కేంద్రం ప్రారంభం
పెద్దకొడప్‌గల్(జుక్కల్) : జొన్న కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ హన్మంత్‌రెడ్డి సూచించారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జొన్నలకు ప్రభుత్వం క్వింటాలుకు రూ. 3,371 మద్దతు ధర ఇస్తోందని తెలిపారు. రైతులు దళారులకు అమ్మి నష్టపోవద్దని సూచించారు. కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు నాగిరెడ్డి, దస్తారెడ్డి, హనుమయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, నాయకులు సంజీవ్, బసవరాజ్, దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.
కాకతీయ కాలువకు
నిలిచిన నీటి విడుదల
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా విడుదలవుతున్న నీటిని ఆదివారం ప్రాజెక్ట్ అధికారులు నిలిపివేశారు. యాసంగి సీజన్ కోసం విడుదలవుతున్న నీటిని ఈ నెల 9వ తేదీనే నిలిపివేయాల్సి ఉంది. కానీ, కాకతీయ కాలువ జోన్–2 ఆయకట్టు కోసం ప్రాజెక్ట్ అధికారులు మూడు రోజులపాటు నీటి విడుదలను కొనసాగించారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ నుంచి అన్ని కాలువలు, లిఫ్టులకు నీటి విడుదల నిలిచిపోగా, ఆదివారం నాటికి ప్రాజెక్ట్‌లో 11.44 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
నిలిచిన విద్యుదుత్పత్తి
కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల నిలిపివేయడంతో జల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. మళ్లీ వచ్చే ఖరీఫ్ సీజన్‌లో కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల చేపట్టే వరకు విద్యుదుత్పత్తి జరిగే అవకాశం ఉండదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 3.44 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగినట్లు జెన్‌కో అధికారులు వెల్లడించారు.
అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ
ఖలీల్‌వాడి(నిజామాబాద్ అర్బన్): అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్లను నిజామాబాద్ సీపీ పోతరాజు సాయిచైతన్య ఆదివారం ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని సీపీ క్యాంప్ ఆఫీసులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీపీ మాట్లాడారు. అగ్నిప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈనెల 14 నుంచి 20 వరకు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ సూపరింటెండెంట్ నవాజ్‌ఖాన్, ఫైర్ ఆఫీసర్ నర్సింగ్ రావు, సిబ్బంది పాల్గొన్నారు.

27న ఆర్యసమాజం స్వర్ణోత్సవ యాగం