ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్‌లకు ఆటంకాలు | - | Sakshi
Sakshi News home page

ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్‌లకు ఆటంకాలు

Published Wed, Apr 16 2025 11:01 AM | Last Updated on Wed, Apr 16 2025 11:01 AM

ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్‌లకు ఆటంకాలు

ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్‌లకు ఆటంకాలు

దోమకొండ : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో పది సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలున్నాయి. నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌, బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌తో పాటు కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, దోమకొండలలో కార్యాలయాలున్నాయి. ప్రభుత్వం ఈనెల 7వ తేదీ నుంచి స్లాట్‌ విధానంలో సవరణలు చేసింది. గ్రామాల్లో ఇళ్లు, ఖాళీ స్థలాలకు గ్రామ పంచాయతీ ధ్రువీకరణ పత్రాలు, ఇంటి పన్ను రశీదు పత్రాలతో ఇప్పటివరకు రిజిస్ట్రేషన్‌లు జరిగాయి. కానీ ప్రస్తుతం సవరించిన స్లాట్‌ విధానంలో ఖాళీ స్థలానికి డీటీసీపీ లేఅవుట్‌ నంబర్‌ లేదా లింక్‌ డాక్యుమెంట్‌ నంబర్‌, లేదా బిల్డింగ్‌ పర్మిషన్‌ ఆన్‌లైన్‌ నంబర్‌ అడుగుతోంది. దీంతో కొత్తగా గ్రామ పంచాయతీ ధ్రువీకరణ పత్రాలతో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడానికి వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో ఇళ్ల నిర్మాణానికి ఇప్పటివరకు మ్యాన్‌వల్‌ పర్మిషన్‌ మాత్రమే ఇచ్చారు. ఆన్‌లైన్‌ పర్మిషన్‌ లేకపొవడం వల్ల ఇళ్ల రిజిస్ట్రేషన్‌లకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. ఖాళీ స్థలాలకు సైతం ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్‌ కాపీ, ట్యాక్స్‌ చెల్లించిన రశీదు ఉంటే రిజిస్ట్రేషన్‌ జరిగేది. కానీ కొత్త విధానం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ విషయంలో సబ్‌ రిజస్ట్రార్‌లకు సైతం ఎలాంటి సమాచారం లేదని తెలుస్తోంది. పైఅధికారుల నుంచి ఇలాంటి వాటికి గతంలో మాదిరిగా రిజిస్ట్రేషన్‌ చేయడానికి వారికి ఏ విధమైన సూచనలు లేవు. దీంతో వారం రోజులుగా ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్‌లు ఆగిపొయాయి.

ఈ–పంచాయతీతో ఇప్పటికే తలనొప్పులు..

ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ–పంచాయతీ పోర్టల్‌తో ప్రజలు ఇప్పటికే తిప్పలు పడుతున్నారు. ఆస్తులను విభజించే విషయంలో రిజిస్ట్రేషన్‌ పూర్తయిన తర్వాత ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఒకరికి మాత్రమే ఇంటి నంబర్‌ రాగా, ఇంకొకరికి తప్పుగా వస్తోంది. ప్రభుత్వం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ప్రవేశపెట్టిన ఈ–పంచాయతీ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ పూర్తయిన తర్వాత బ్లాక్‌ నంబర్‌ తప్పుగా వస్తోంది. దీంతో వారు అటు గ్రామ పంచాయతీ, ఇటు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఆ సమస్య పరిష్కారం కాకముందే మళ్లీ కొత్త సమస్య రావడంతో రిజిస్ట్రేషన్‌ల కోసం వస్తున్న ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై రాష్ట్ర స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.

దోమకొండకు చెందిన ఓ వ్యక్తికి గ్రామంలో పాత భవనం, ఖాళీ స్థలం ఉంది. దానిని తన ఇద్దరు కుమారులకు చేరి సగం రిజిస్ట్రేషన్‌ చేయాలని నిర్ణయించి గ్రామ పంచాయతీ నుంచి తన పేరుమీద ఇల్లు, స్థలం ఉన్నట్లుగా ధ్రువీకరణ పత్రాలు తీసుకుని రిజిస్ట్రేషన్‌ స్లాట్‌ బుకింగ్‌ కోసం వచ్చాడు. అయితే పాత ఇంటికి సైతం ఆన్‌లైన్‌ బిల్డింగ్‌ పర్మిషన్‌ అడుగుతుండడంతో ప్రక్రియ ముందుకు సాగడం లేదు. అంతేకాకుండా ఖాళీ స్థలానికి డీటీసీపీ లేఅవుట్‌ నంబర్‌ సైతం అడుగుతోంది. దీంతో ఇల్లు, ఖాళీ స్థలం రిజిస్ట్రేషన్‌ నిలిచిపోయాయి. వారం నుంచి వారు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఇలా చాలా మంది ఇబ్బందిపడుతున్నారు.

స్లాట్‌ విధానంలో సవరణలు

చేసిన ప్రభుత్వం

ఖాళీ స్థలాలకు సైతం బిల్డింగ్‌ పర్మిషన్‌ అడుగుతున్న వైనం

వారం రోజులుగా నిలిచిన

ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్లు

కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ప్రజలు

స్లాట్‌ విధానంలో మార్పులతో ఇబ్బందులు..

ఈనెల 7వ తేదీ నుంచి స్లాట్‌ విధానంలో మార్పు లు వచ్చాయి. సవరించిన స్లాట్‌ విధానం వల్ల గతంలో మాదిరిగా ఖాళీ స్థలాలు, ఇళ్లను గ్రామ పంచా యతీ ధ్రువీకరణ పత్రాలతో రిజిస్ట్రేషన్‌ చేయడా నికి వీలులేదు. వాటికి లేఅవుట్‌ పర్మిషన్‌ లేదా గ్రా మ పంచాయితీ బిల్డింగ్‌ ఆన్‌లైన్‌ పర్మిషన్‌ అవసరం అవుతాయి. లేదంటే లింకు డాక్యుమెంట్‌ ఉండాలి. కొత్త విధానం వల్ల రిజిస్ట్రేషన్‌లు బాగా తగ్గాయి. విషయాన్ని పైఅధికారుల దృష్టికి తీసుకువెళ్లాం.

– రమేశ్‌, ఇన్‌చార్జి

సబ్‌రిజిస్ట్రార్‌, దోమకొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement