మాక్లూర్ : పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని ఈ నెల 13న చిక్లి గ్రామశివారులో వడ్డె చిన్న గంగాధర్ (48) అనే వ్యక్తిని ట్రాక్టర్‌తో ఢీ కొట్టి మరణానికి కారణమైన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మాక్లూర్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నార్త్ జోన్ సీఐ బీ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. చిక్లి గ్రామానికి చెందిన వడ్డె చిన్న గంగాధర్‌కు అదే గ్రామానికి చెందిన కారం నవీన్‌కు మధ్య భూ తగాదాలు ఉన్నాయి. ఈ విషయంలో విడగొట్టు ప్రసాద్ అనే వ్యక్తి కారం నవీన్‌కు మద్దతు తెలపడంతో ఈ నెల 13న సొసైటీ గోదాం వద్ద ఘర్షణ జరిగిందన్నారు. నవీన్ వ్యక్తిగత విషయాలను మృతుడు వడ్డె చిన్న గంగాధర్ బహిరంగంగా విమర్శించేవాడని తెలిపారు. ఇద్దరి మధ్య తగాదాను పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడే క్రమంలోనే చిన్న గంగాధర్‌ను నవీన్ ఉద్దేశపూర్వకంగానే ట్రాక్టర్‌తో ఢీకొట్టి మరణానికి కారణమైనట్లు పేర్కొన్నారు. విడగొట్టు ప్రసాద్‌ను ఏ–2గా చేర్చినట్టు సీఐ శ్రీనివాస్ తెలిపారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై శేఖర్, పోలీసు సిబ్బందిని సీఐ అభినందించారు.
వేంకటేశ్వర ఆలయంలో చోరీ
బాల్కొండ: మండలంలోని వన్నెల్(బీ) వేంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు హుండీ పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. 15 రోజుల క్రితమే ఉత్సవాలు జరగడంతో భక్తులు హుండీలో అధికంగా ముడుపులు వేసినట్లు స్థానికులు తెలిపారు.
నస్రుల్లాబాద్‌లో..
నస్రుల్లాబాద్(బాన్సువాడ): మండలంలోని మైలారం గ్రామానికి చెందిన మహేందర్ గౌడ్‌కు చెందిన కిరాణా షాపు, నస్రుల్లాబాద్ మండల కేంద్రానికి చెందిన మోయిన్ ఖాన్ పాన్‌షాపులలో చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మూసి ఉన్న షాపుల తాళాలు పగులకొట్టి నగదును అపహరించారని పేర్కొన్నారు. దుండగులు నస్రుల్లాబాద్‌లోని పాల కేంద్రం, కిరాణాషాపులో చోరీకి యత్నించారని తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
బాయిలర్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం
మద్నూర్(జుక్కల్): మండల కేంద్రానికి సమీపంలోని సాయిరాం ఆగ్రో బాయిలర్ ఫ్యాక్టరీలో మంగళవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. బాయిలర్ ఫ్యాక్టరీలో బ్రిక్స్ తయారి కోసం పెద్ద మొత్తంలో సోయాబీన్, శనగ, కంది పొట్టును సేకరించారు. ఫ్యాక్టరీ నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో కూలీలు, యజమానులు బయటకు పరుగు లు తీశారు. మద్నూర్ అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో మహారాష్ట్ర లోని దెగ్లూర్ ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. రెండు ఫైరింజన్లతో సి బ్బంది మూడు గంటలపాటు కష్టపడి మంటలను ఆర్పివేశారు. సుమారు రూ. 10లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
హత్య కేసులో నిందితుల అరెస్టు
హత్య కేసులో నిందితుల అరెస్టు