
పాఠశాలల అభివృద్ధికి చేయూతనివ్వాలి
రుద్రూర్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డ పూర్వ విద్యార్థులు ఆయా పాఠశాలల అభివృద్ధికి చేయూత అందించాలని జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ సూచించారు. రుద్రూర్ హైస్కూల్‌లో 1965 నుంచి 2015 వరకు చదివిన విద్యార్థులతో రైడ్స్ (రుద్రూర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎడ్యుకేషనల్ సొసైటీ)ని ఏర్పాటు చేయగా.. అందుకు సంబంధించిన లోగోను జేటీసీ శనివారం ఆవిష్కరించారు. అనంతరం రైడ్స్ నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. రైడ్స్ శాశ్వత గౌరవ అధ్యక్షుడిగా తనను ఎన్నుకోవడంపై సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జేటీసీ చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ రైడ్స్ కార్యక్రమాలకు మామిండ్ల రామాగౌడ్ స్మారక ట్రస్ట్ అండగా ఉంటుందని అన్నారు. విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయడంతోపాటు పేద విద్యార్థుల ఉన్నత చదువులకు రైడ్స్ ద్వారా తోడ్పాటు అందిస్తామన్నారు.