
ఫ్రూట్ సలాడ్ కోసం వెళ్తే రూ. లక్ష మాయం
బాన్సువాడ : ఫ్రూట్ సలాడ్ తాగేందుకు వచ్చిన ఓ వ్యక్తి రూ. లక్ష నగదును పోగొట్టుకున్న ఘటన బాన్సువాడలో చోటు చేసుకుంది. బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ గ్రామానికి చెందిన సాయిలు అనే వ్యక్తి శనివారం బాన్సువాడలోని ఓ బ్యాంకులో రూ. లక్ష నగదును డ్రా చేసుకుని ఫ్రూట్ సలాడ్ తాగేందుకు కూల్‌డ్రింక్ దుకాణానికి వెళ్లాడు. ఫ్రూట్ సలాడ్ తాగుతున్న సమయంలో చేతిలో ఉన్న నగదు కవరును టేబుల్‌పై పెట్టి సలాడ్ తాగి కవర్‌ను అక్కడే మరిచి వెళ్లిపోయాడు. పది నిమిషాల తర్వాత అక్కడికి రాగా నగదు ఉన్న కవర్ కనిపించలేదు. అక్కడున్న సీసీ కెమెరాను పరిశీలించగా ఓ యువకుడు కవరును తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. వెంటనే సాయిలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
యువకుడిపై కేసు నమోదు
రుద్రూర్: మండలంలోని బొప్పాపూర్‌లో మూడు గడ్డివాములు దగ్ధమైన ఘటనలో నందిగామ ప్రవీణ్‌పై కేసు నమోదు చేసినట్టు ఎస్సై సాయన్న తెలిపారు. ఆదివారం తెల్లవారు జామున సంగోళ్ల వినోద్, పట్ల సాయిలు, నరోజి లచ్చయ్య గడ్డివాములకు నిప్పంటించి ప్రవీణ్ పారి పోయినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు.
అనుమతులు లేకుండా
టేకు చెట్ల నరికివేత
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణంలోని ఎస్సీ బాలికల హాస్టల్‌లో అనుమతులు లేకుండా టేకు చెట్లను నరికి వేసిన ఘటనపై కామారెడ్డి అటవీశాఖ స్ట్రైకింగ్ ఫోర్స్ అధికారులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. హాస్టల్‌లో అనుమతులు లేకుండా టేకు చెట్లను నరికి వేశారన్న సమాచారం మేరకు కామారెడ్డి అటవీశాఖ స్ట్రైకింగ్ ఫోర్స్ డీఆర్‌వో అనురంజని, సెక్షన్ ఆఫీసర్ గోపాల్ పరిశీలించారు. నాలుగు చెట్లను నరికి టేకు దుంగలను ఓగదిలో ఉంచిన దానిని పరిశీలించడంతో పాటు, నరికి వేసిన టేకు చెట్ల కొలతలను తీసుకున్నారు. నరికిన టేకు దుంగల విలువ సుమారు రూ. 30 వేల వరకు ఉంటుందన్నారు. టేకు దుంగలను సీజ్ చేసి ఉన్నతాధికారులకు నివేదికను అందిస్తామని డీఆర్‌వో తెలిపారు.