
తాగునీటి కోసం ఆందోళన
లింగంపేట: తాగునీటి కోసం గాంధీనగర్‌వాసులు ఆందోళనకు దిగారు. కామారెడ్డి –ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామానికి నీటిని సరఫరా చేసే బోరుబావిలో నీరు అడుగంటిందన్నారు. మరికొన్ని పైపులు దించితే నీరు అందించే అవకాశం ఉన్నా నిధుల కొరతతో పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. సమీపంలోని వ్యవసాయ బోరుబావులలోనూ నీరు అడుగంటడంతో నీటికోసం అవస్థలు పడుతున్నామన్నారు. ట్యాంకర్ ద్వారా సరఫరా చేస్తున్న నీరు సరిపోవడం లేదన్నారు. సమస్య పరిష్కరించాలంటూ సుమారు గంటపాటు రాస్తారోకో చేయడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎంపీడీవో గ్రామానికి వచ్చి మాట్లాడారు.
తాగునీరు సరఫరా చేయిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. ఎంపీడీవో వెంటనే మరో ట్యాంకరు ఏర్పాటు చేసి తాగునీరు సరఫరా చేశారు. అలాగే మిషన్ భగీరథ పైపులైన్‌కు మరమ్మతులు చేయించి నీటి సరఫరాను పునరుద్ధరించారు.