Gidugu Rammurthy : తేట తెలుగు.. తేనెలొలుకు | - | Sakshi
Sakshi News home page

Gidugu Rammurthy : తేట తెలుగు.. తేనెలొలుకు

Published Tue, Aug 29 2023 12:04 AM | Last Updated on Tue, Aug 29 2023 6:22 PM

గిడుగు–పిడుగు పుస్తక ముఖచిత్రం - Sakshi

గిడుగు–పిడుగు పుస్తక ముఖచిత్రం

విద్యానగర్‌/కరీంనగర్‌ కల్చరల్‌(కరీంనగర్‌):

మనిషి జీవన విధానంలో ఆయువుపట్టు వంటిది మాతృభాష. అందులో జ్ఞానాన్ని పొందలేనివారిలో అభివృద్ధి తక్కువగా ఉంటుందని, వ్యక్తిత్వ వికాసం, మేధాపరమైన ప్రగతి మందగిస్తాయని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. దేశ భాషలందు తెలుగు లెస్స అని, ఇటాలియన్‌ ఆప్‌ ద ఈస్ట్‌ అని ప్రశంసలందుకున్న తెలుగుకు చాలా ప్రాధాన్యం ఉంది. ఈ భాషలోని నుడికారాలు, సామెతలు, జాతీయాలు, లోకోక్తులు వేటికవే ప్రత్యేకం. అమ్మ భాషలోనే మన భావోద్వేగాలను హాయిగా వెల్లడించగలుగుతాం. తెలుగు భాష ఉన్నతి కోసం విశేష కృషి చేసిన గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి(ఆగస్టు 29న) సందర్భంగా ఏటా ఈరోజున తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం.

మాతృభాష తృణీకారం.. మాతృదేవి తిరస్కారంతో సమానం

– సినీ కవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి

అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు

సకిలించు ఆంధ్రుడా..  చావవెందుకురా..!

– ప్రజాకవి కాళోజీ

ప్రాధాన్యత కోల్పోతున్న తెలుగు

గిడుగు వెంకట రామ్మూర్తి కృషితో తెలుగుకు కొత్త వెలుగులు వచ్చినప్పటికీ పాలకుల నిర్వాకంతో అమ్మ భాష రోజురోజుకూ నిరాదరణకు గురవుతోంది. తెలుగులో రాయడం ఆత్మన్యూనతగా, ఆంగ్ల మాధ్యమంలో చదవడం నాగరికంగా మారిన కారణంగా సొంత గడ్డపైనే తెలుగు పరాయిదయిపోయింది. అధికార భాషగా తెలు గును అమలు చేయాలన్నది ఆచరణలో అంతంతమాత్రంగానే ఉంది. తెలుగు ప్రజల విజ్ఞప్తి మేరకు 2011లో కేంద్ర ప్రభుత్వం తెలుగును ప్రా చీన భాషగా ప్రకటించింది. తెలుగువారి ప్రస్తావ న మహాభారతం, బౌద్ధుల కాలంలోనూ ఉంది.

తెలుగు మహాసభలు

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఒక వేది కపై తీసుకువచ్చి, తెలుగు భాషా సంస్కృతి, చరి త్ర, కళలను తెలుసుకొని, స్నేహ సంబంధాలను వృద్ధి చేసుకోవాలన్న లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలకు శ్రీకారం చుట్టింది. 1975 నుంచి 2012 వరకు అప్పటి అంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2017 మే 2న తెలంగాణ సాహితీ అకాడమీ ఏర్పాటు చేసింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో అదే ఏడాది అక్టోబర్‌లో తెలుగు మహాసభలు నిర్వహించారు. అప్పటినుంచి మళ్లీ వాటి ఊసే లేకుండా పోయింది.

చిరస్మరణీయుడు.. గిడుగు

గిడుగు చిరస్మరణీయుడు. ఆయన వ్యవహారిక భాషోద్యమం వల్ల ఆధునిక సాహిత్యం కొత్త సొగసులు సంతరించుకుంది. విశ్వవిద్యాలయాల్లో వాడుక భాష రాజ్యమేలుతోంది. పత్రికలూ పెరిగాయి. అక్షరాస్యత పెరిగింది.

– నంది శ్రీనివాస్‌, సాహితీ గౌతమి అధ్యక్షుడు

కవులు చైతన్యం తీసుకురావాలి

ఆంగ్ల భాష వ్యామోహంలో పడి, తెలుగు భాషను విస్మరిస్తున్నాం, ఉద్యోగ నియామకాల్లో తెలుగు మీడియంలో చదివినవారికే ప్రాధాన్యం ఇవ్వాలి. కోర్టు తీర్పులు తెలుగులో వెలువడేలా చూడాలి. కవులు, రచయితలు తమ రచనల ద్వారా సమాజంలో చైతన్యం తీసుకురావాలి.

– దాస్యం సేనాధిపతి, ప్రముఖ కవి, విమర్శకుడు

తెలుగులో సాంకేతిక విద్యనందించాలి

ఆలోచనలను వ్యక్తపరిచే సాధనం అమ్మ భాష. నేడు తెలుగులో మాట్లాడటమే చిన్నతనంగా భావించడం బాధాకరం. సాంకేతిక విద్యను సైతం తెలుగు మీడియంలో అందించాలి. తెలుగు మాధ్యమంలో చదివే విద్యార్థులకు ప్రత్యేక వెయిటేజీ ఇవ్వాలి.

– గాజుల రవీందర్‌, ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు

మాతృభాష నేర్పించండి

తెలుగు భాషను పరిరక్షించాలి. ప్రాథమిక చదువులు మాతృభాషలో కొనసాగితేనే ఆలోచన శక్తి, ప్రశ్నించేతత్వం విద్యార్థుల్లో పెరుగుతాయి. తల్లిదండ్రులు ఆంగ్లంపై ఉన్న వ్యామోహన్ని తగ్గించి, పిల్లలకు మాతృభాష నేర్పించాలి.

– కేఎస్‌.అనంతాచార్య, సమైక్య సాహితీ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌

పరిపాలనలో అమలు చేయాలి

తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులకు ఉన్నత విద్య, ఉద్యోగావకాశాల్లో రిజర్వేషన్‌ వర్తింపజేయాలి. వారికి పోత్సాహకాలు ఇవ్వాలి. పాలకులు పరిపాలనలో తెలుగును పక్కాగా అమలు చేయాలి. అందరం అమ్మ భాషకు పట్టం కడదాం.

– మాడిశెట్టి గోపాల్‌, సమైక్య సాహితీ అధ్యక్షుడు, కరీంనగర్‌

కొత్త తరానికి అందించాలి

భాషా నుడికారాలు, సాహిత్య సౌరభాలను కొత్త తరానికి అందించాలి. ప్రపంచీకరణతో మన భాషా సంస్కృతులను రక్షంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆంగ్ల భాష వ్యామోహం నుంచి మాతృభాష వైపు మళ్లాల్సిన అవసరం ఉంది.

– కొత్త అనిల్‌కుమార్‌, తెలంగాణ రచయితల సంఘం, కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/6

2
2/6

3
3/6

4
4/6

5
5/6

6
6/6

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement