జగిత్యాల: నామినేషన్ల ఘట్టం ముగిసిపోవడంతో బుధవారం ఎవరెవరు అభ్యర్థులు బరిలో ఉంటారో తెలుస్తుంది. ఈసారి స్వతంత్రులు అధికంగానే ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎవరి దారిలో వారు ప్రచారం చేపడుతున్నారు. ప్రతి ఒక్క ఓటు ఎంతో విలువైంది కావడంతో ప్రధాన అభ్యర్థుల నుంచి స్వతంత్రుల వరకు నియోజకవర్గంలో ఎక్కడ ఏం జరిగినా అక్కడకు వెళ్తున్నారు. ఎవరైనా మరణించినా, ఏమైనా సంఘటనలో గాయపడ్డా ఉదయమే అక్కడకు వెళ్లి పరామర్శిస్తున్నారు. గతంలో రాని నాయకులు ఈసారి ప్రతిదానికి వెళ్లడంతో ప్రజలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఓటు విలువ ఎంత ఉందో తెలుస్తుంది.
ఈనెల 16 నుంచి మంచి ముహూర్తాలు
► రానున్న రెండురోజుల్లో వివాహ వేడుకలు సైతం ఊపందుకోనున్నాయి.
► కార్తీకమాసం ప్రారంభం కానుండటంతో 8 నుంచి 10 రోజుల పాటు వివాహాలు జరగనున్నట్లు పండితులు పేర్కొంటున్నారు.
► ఈనెల 30న పోలింగ్ ఉండగా, ఇంతకంటే ముందే వివాహ వేడుకలు అత్యధికంగా ఉండటంతో ప్రతీ వేడుకకు హాజరయ్యేందుకు అభ్యర్థులు సైతం ప్రణాళికలు ఇప్పటి నుంచే రూపొందించుకుంటున్నారు.
► గతంలో వివాహ వేడుకలకు రావాలని స్వయాన కుటుంబ సభ్యులు శుభలేఖలు అందజేసినా సమయం ఉంటేనే వెళ్లేవారు. ఇప్పుడు ఎన్నికల సమయం కావడంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకోవడం కోసం పిలవకపోయినా వివాహ వేడుకలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
► దాదాపు పెళ్లిల్లో చాలా జనాలు ఉంటారు కాబట్టి వివాహ వేడుకలకు హాజరైతే ఓట్లు వచ్చే అవకాశాలుంటాయని అభ్యర్థులు ఆలోచిస్తున్నారు.
► ఒకవైపు పరామర్శించడంతో పాటు, మరోవైపు శుభకార్యాల్లో పాల్గొంటూ నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.
► ఈనెలలో 16 నుంచి 29 వరకు మంచి ముహూర్తాలు ఉండటంతో ఆ సమయంలోనే ప్రచారం హోరెత్తనుంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ప్రతి ఒక్క అభ్యర్థి ఇంటింటికీ వెళ్తూ అవ్వలను, మహిళలను, వృద్ధులను, యువతను కలుస్తూ ఓటు తమకే వేయాలంటూ వేడుకుంటున్నారు.
► ఎన్నికలకు మరో మరో 15 రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఉదయం 4 నుంచి 5 గంటలలోపే గ్రామాలు, మండలాల్లో ప్రచారం ప్రారంభిస్తున్నారు.
► మున్సిపాలిటీల్లో రాత్రిపూట విస్తృత ప్రచారం చేపడుతున్నారు. ఏదేమైనా అభ్యర్థులకు ప్రచారంలో ముచ్చెమటలు పడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment