కారు చెట్టుకు ఢీకొని బీఆర్‌ఎస్ నాయకుడి దుర్మరణం
మేడిపల్లి: మేడిపల్లి, మోహన్‌రావుపేట జతీయ రహదారిపై మంగళవారం వేకువజామున కారు చెట్టు కు ఢీకొని మండలంలోని పోరుమల్ల గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు ఎన్నమనేని సుజిత్‌రావు (46) మృతి చెందాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఎన్నమనేని సుజిత్‌రావు వ్యాపారి. బీఆర్‌ఎస్ నాయకుడు. సోమవారం సాయంత్రం వివిధ పనుల నిమిత్తం కోరుట్ల వెళ్లాడు. వేకువజామున మూడు గంటల ప్రాంతంలో తన కారులోనే డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి బయల్దేరాడు.
మరో ఐదు కిలోమీటర్లయితే ఇంటికి చేరుకునేవారే కానీ.. నిద్రమత్తులో మేడిపల్లి సరిహద్దు వద్ద రహదారి పక్కన గల చెట్టుకు కారు బలంగా ఢీకొన్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు హుటాహుటిన జగిత్యాలకు ఆసుపత్రికి పంపించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. సుజన్‌రావు మండలానికి చెందిన దొనకంటి వేణుగోపాల్‌రావుకు అల్లుడవుతారు. వేణుగోపాల్‌రావు మండలంలో అందరికీ సుపరిచితుడు. 2006–2011లో వైస్ ఎంపీపీగా కొనసాగారు.
సుజన్‌రావు మృతివార్త తెలుసుకున్న వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కల్వకుంట్ల అనిల్, కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్, జిల్లాకు చెందిన ప్రజప్రతినిధులు తరలివచ్చారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు. సుజిత్‌రావుకు భార్య ప్రణవిరావు, కుమారుడు ఉన్నారు. ప్రణవిరావు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్యాంరాజ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment