నా భర్త ఆచూకీ తెలపండి
సెంట్రింగ్ పనికి రాయికల్ వెళ్లి, తిరిగి రాలేదు..
నెల రోజులైంది.. పిల్లలు ఏడుస్తున్నరు..
కనిపిస్తే సమాచారం ఇవ్వండి
హుజూరాబాద్‌కు చెందిన మహిళ వేడుకోలు
హుజూరాబాద్: నెల రోజుల క్రితం నా భర్త సెంట్రింగ్ పని కోసం వెళ్లాడు.. తిరిగి రాలేదు.. పిల్లలు నాన్న ఎక్కడని ఏడుస్తున్నరు.. ఆయన ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి అంటూ ఓ మహిళ వేడుకుంటోంది. బాధితురాలి వివరాల ప్రకారం.. హుజూరా బాద్ పట్టణంలోని కుమ్మరివాడకు చెందిన మోతె రమ్య–రఘుపతి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రఘుపతి గత నెల 3వ తేదీన సెంట్రింగ్ పని కోసం సైదాపూర్ మండలంలోని రాయికల్ వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. రాత్రయినా తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు.
మరుసటి రోజు రాయికల్ చెరువు కట్ట వద్ద అతని ద్విచక్రవాహనం కనిపించింది. ఆ గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో వెతికినా ప్రయోజనం లేకపోయింది. దీంతో రమ్య గత నెల 5న సైదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, అతని కోసం వెతుకుతున్నారు. ఇప్పటివరకు రఘుపతి జాడ తెలియలేదు. పిల్లలు నాన్నపై బెంగతో ఏడుస్తున్నారని రమ్య కన్నీరు పెట్టుకుంటోంది. రఘుపతికి అప్పుడప్పుడు చలి తీవ్రతకు మతిస్థిమితం సరిగా ఉండదని, దారితప్పి వెళ్లి ఉంటాడని చెబుతోంది.
కొన్ని రోజుల క్రితం చిగురుమామిడి మండలంలోని సుందరగిరిలో కనిపించాడని, రేకొండ గ్రామంలో కనిపించాడని స్థానికులు సమాచారం ఇచ్చినట్లు తెలిపింది. కానీ, ఆయా ప్రాంతాల్లో వెతికినా దొరకలేదని వాపోయింది. బ్లూ కలర్ షర్టు, నైట్ ప్యాంట్ ధరించాడని, 5.7 సెంటీమీటర్లు ఎత్తు, చామనఛాయ రంగులో ఉంటాడని, గుండు చేయించుకున్నాడని పేర్కొంది. మంచం పట్టిన అతని తండ్రి, వృద్ధురాలైన తల్లి ఆందోళన చెందుతున్నారని, ఎవరికై నా కనిపిస్తే సైదాపూర్ పోలీసులకు గానీ, తమకు గానీ సమాచారం ఇవ్వాలని కోరుతోంది. రఘుపతిని తమకు అప్పగిస్తే తగిన ప్రోత్సాహకం అందిస్తామని కుటుంబసభ్యులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment