ఎక్కడున్నారో.. ఏమయ్యారో?
కరీంనగర్ కమిషనరేట్‌లో ఈ ఏడాది 297 మిస్సింగ్ కేసులు
ఎక్కువ శాతం మహిళలే అదృశ్యం
మతిస్థిమితం లేక కొందరు.. ఆర్థిక ఇబ్బందులతో మరికొందరు
ప్రేమ పేరిట మోసపోతున్న యువతులు
కరీంనగర్ క్రైం: కరీంనగర్ కమిషనరేట్ పరిఽధిలో మిస్సింగ్ కేసులు పెరుగుతున్నాయి. కనిపించకుండా పోతున్నవారిలో ఎక్కువ శాతం మహిళలే ఉంటుండటం ఆందోళన కలిగిస్తోంది. దాంపత్య జీవితంలో గొడవలతో కొందరు ఇంటికి దూరమవుతుండగా.. మరికొందరు ప్రేమ పేరిట మోసపోతూ ఇళ్ల నుంచి వెళ్లి తిరిగి రావడం లేదు. మతిస్థిమితం లేనివారు, వివిధ వ్యాధులతో బాధపడుతున్నవారిదీ ఇదే దారి. ఈ ఏడాది ఇప్పటివరకు జిల్లాల్లోని పోలీస్‌స్టేషన్లలో 297 మిస్సింగ్ కేసులు నమోదవగా 257 కేసులను పోలీసులు ఛేదించారు.
180 మంది మహిళలు..
ప్రేమ పేరిట మోసపోతున్న యువతులు, బాలికల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. బాధిత కుటుంబసభ్యులు వారి బంధువులు, స్నేహితులు, తెలిసినవారి ఇళ్లలో వెతుకుతూ చివరకు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పోలీసుల విచారణలో ప్రేమ వ్యవహారమే కారణమని తేలిన సందర్భాలు అనేకం ఉంటున్నాయి. కరీంనగర్ కమిషనరేట్‌లో ఇప్పటివరకు 180 మంది మహిళలు, 12 మంది బాలికలు అదృశ్యమవగా పోలీసులు 165 మహిళలు, 11 మంది బాలికలను గుర్తించి, వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. కుటుంబ కలహాలతో ఇంటి నుంచి వెళ్లినవారు, మతిస్థిమితం లేకుండా వెళ్లిపోయినవారు కొందరిని సీసీ కెమెరాల సహాయంతో పట్టుకున్నారు.
వ్యాపారాల్లో నష్టాలతో పలువురు..
పలువురు వ్యాపారులు కరీంనగర్‌ను వదిలి వెళ్లిపోతున్నారు. వ్యాపారాల్లో పెద్ద మొత్తంలో నష్టాలు వచ్చి, ఇక్కడ ఉండలేక ఇతర పట్టణాలకు రాత్రికిరాత్రే జంప్ అవుతున్నారు. చిట్టీలు నడిపించి నష్టపోయిన కొందరు, వడ్డీ వ్యాపారుల నుంచి డబ్బులు తీసుకొని, తిరిగి చెల్లించలేనివారు మరికొందరు ముఖం చాటేస్తూ దూర ప్రాంతాలకు వెళ్తుండటంతో ఇక్కడ మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి. పోలీసులు వాటిని ఛేదించడానికి టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment