సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ రూపకల్పన కసరత్తును రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి అవసరమైన నిధులను అన్ని ప్రభుత్వ శాఖలు ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఆర్థిక శాఖకు పంపాయి. ఈ ప్రతిపాదనలపై ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో బడ్జెట్ తయారీ కోసం శాఖల వారీగా సమీక్షలు జరుగుతున్నాయి. ఇప్పటికే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమం, ఆర్ అండ్ బీ, బీసీ సంక్షేమం, రవాణా, వ్యవసాయం, జౌళి శాఖలపై సమీక్షలు పూర్తికాగా, శనివారం రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై భట్టి విక్రమార్క.. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో కలిసి ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. బడ్జెట్ రూపకల్పన, ప్రభుత్వ ప్రాధాన్యతల గురించి మంత్రులు అధికారులకు దిశానిర్దేశం చేశారు. మిగిలిన శాఖల అంచనాలపై కూడా వచ్చే వారం నాటికి సమీక్షలు పూర్తవుతాయని, అనంతరం బడ్జెట్ తయారీలో ఆర్థిక శాఖ పూర్తిస్థాయిలో నిమగ్నమవుతుందని తెలుస్తోంది. మార్చి మొదటి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన ప్రభుత్వం ఆ సమావేశాల్లో 2025–26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. కాగా, ఈసారి బడ్జెట్ పరిమాణం పెరుగుతుందా, తగ్గుతుందా అన్న దానిపై ఆర్థిక శాఖ వర్గాలు తర్జనభర్జనలు పడుతున్నాయి. కేంద్రం నుంచి రావాల్సిన సాయం విషయంలో ఆశించిన మేర నిధులు రాకపోవడం, ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో సొంత ఆదాయ రాబడులపైనే దృష్టి సారించి బడ్జెట్‌ను రూపొందించాల్సి ఉంటుందని, బడ్జెట్ పరిమాణంపై రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనను బట్టి నిర్ణయం తీసుకుంటామని ఆర్థిక శాఖ వర్గాలు చెప్పాయి.
ఇప్పటికే ప్రభుత్వానికి చేరిన అన్ని శాఖల అంచనాలు శాఖల వారీగా సమీక్షలు జరుపుతున్న డిప్యూటీ సీఎం భట్టి
Comments
Please login to add a commentAdd a comment