మళ్లొస్తాం రాజన్నా
● ముగిసిన మహాశివరాత్రి ఉత్సవాలు ● కొనసాగుతున్న భక్తుల రద్దీ ● బద్దిపోచమ్మకు బోనం మొక్కులు ● రెండు రోజుల్లో రూ.కోటికిపైగా ఆదాయం
వేములవాడ: మహాశివరాత్రి జాతర ముగిసింది. ముల్లెమూటలు.. పిల్లపాపలతో భక్తులు ఇంటికి తిరుగుప్రయాణమయ్యారు. మూడు రోజులుగా వేములవాడ రాజన్న ఆలయంలో అంగరంగ వైభవంగా జరిగిన మహాశివరాత్రి జాతర ఉత్సవాలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. కోడెమొక్కులు, తలనీలాల సమర్పణ, నిలువెత్తు బెల్లం పంపిణీ, గండదీపంలో నూనెమొక్కులు చెల్లించుకున్నారు. రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్న భక్తులు జాగరణ ముగియడంతో గురువారం బద్దిపోచమ్మకు బోనాలు సమర్పించుకున్నారు. కల్లుసాక పోసి... పట్నాల మొక్కులు చెల్లించుకున్నారు. గుడి చెరువు ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేసిన శివార్చన వద్ద దాదాపు 40వేల మంది భక్తులు సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తూ జాగరణ పూర్తి చేశారు. రాష్ట్ర సాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్, ఈవో కొప్పుల వినోద్‌రెడ్డి, ఈఈ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. మహాజాతర సందర్భంగా బుధ, గురువారాల్లో దాదాపు 4 లక్షలకు పైగా భక్తులు రాజన్నను దర్శించుకున్నారు. ఫ్రీ పాస్‌లు రద్దు చేశారు. రెండు రోజుల్లో రూ.కోటికిపైగా ఆదాయం సమకూరినట్లు ఆలయ అకౌంట్స్ అధికారులు తెలిపారు. మహాజాతర ఉత్సవాలకు హాజరైన లక్షలాది మంది భక్తులకు సరిపడా లడ్డూ ప్రసాదాలు, పులిహోర తయారుచేసిన సిబ్బందికి ఆలయ ఈవో వినోద్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సిబ్బందిని కలిసి సేవలను కొనియాడారు. ఏఈవో శ్రవణ్, ప్రొటోకాల్ ఏఈవో అశోక్‌కుమార్, పర్యవేక్షకులు శ్రీకాంత్‌చారి, సీనియర్ అసిస్టెంట్లు ఎడ్ల శివసాయి, పురాణం వంశమోహనశర్మ, జూనియర్ అసిస్టెంట్ సింహాచారి తదితరులు ఉన్నారు.
సహకరించిన వారికి కృతజ్ఞతలు
మూడు రోజులుగా నిర్వహించిన మహాశివరాత్రి జాతర విజయవంతం కావడానికి కృషి చేసిన అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, ఆలయ సిబ్బందికి ఆలయ ఈవో కొప్పుల వినోద్‌రెడ్డి గురువారం కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆలయ ఉద్యోగుల సంఘం నాయకులు ఈవో, ఏఈవో అశోక్‌లను శాలువాతో సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment