కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తి పన్నుల వసూళ్ల కోసం కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ రంగంలోకి దిగారు. ఆదివారం నగరంలోని పలు డివిజన్లలో పర్యటించారు. రెవెన్యూ అధికారులు, సిబ్బందితో కలిసి మొండి బకాయిదారుల నివాసగృహాలను సందర్శించారు. కొన్నేళ్లుగా ఆస్తి పన్ను చెల్లించని బకాయిదారుల నుంచి పన్నులు వసూలు చేశారు. నగరంలోని రాంనగర్ లిటిల్‌పార్కుతో పాటు మార్కెట్ రోడ్డులోని పలు లాడ్జీలు, కమర్షియల్ షాపులను సందర్శించారు. మొండి బకాయిదారులను పన్నులు చెల్లించాలని డిమాండ్ చేశారు. 2024– 2025 ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్నుల చెల్లింపుల గడువు ముగుస్తున్నందున మొండి బకాయిదారులపై మున్సిపల్ చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే రెడ్‌నోటీసులు జారీ చేసినా.. పన్నులు చెల్లించని వారి షాపులకు తాళాలు వేయడంతో పాటు నివాస గృహాలకు నగరపాలక సంస్థ ద్వారా ఇచ్చే అత్యవసర సేవలను తొలగించడంతో పాటు నల్లా కనెక్షన్లు తొలగించాలని అధికారులను ఆదేశించారు. నగర ప్రజ లు ఆర్థిక సంవత్సరం గడువులోగా ఆస్తి పన్నులు, నల్లా పన్నులు, ట్రేడ్ లైసెన్స్ పన్నులు చెల్లించి నగరపాలకసంస్థ అభివృద్ధికి సహకరించాలని కోరారు. డిప్యూటీ కమిషనర్ స్వరూప రాణి, ఇన్‌చార్జి ఆర్వో కరీముల్లాఖాన్ పాల్గొన్నారు.