రామగుండం: ఎదురుగా ఉన్న టిప్పర్‌ను ఢీకొనడంతో వాహనదారు దుర్మరణం చెందిన ఘటన సోమవారం రాజీవ్ రహదారిపై చోటుచేసుకుంది. అంతర్గాం ఎస్సై వెంకటస్వామి కథనం ప్రకారం.. అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన బండి ప్రసాద్‌గౌడ్(34) జీడీకే– 11 ఇంక్లయిన్ గనిలో విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు. మల్యాలపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో కారును ఓవర్‌టేక్ చేశాడు. దాని ముందు వెళ్తున్న టిప్పర్‌ను వెనుక నుంచి ఢీకొన్నాడు. తీవ్రగాయాలతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య జ్యోతి, ఇద్దరు కుమారులు ఉన్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నామని ఎస్సై పేర్కొన్నారు.
ఆందోళనకు దిగిన యువకులు
ఎన్టీపీసీ డ్యాం గేట్ ఎదుట మల్యాలపల్లి గ్రామ యువకులు రాత్రి ఆందోళనకు దిగారు. ఎల్కలపల్లి సమీప ఎన్టీపీసీ యాష్‌పాండ్ నుంచి బూడిద లోడుతో టిప్పర్లు రాజీవ్ రహదారిపైకి వస్తున్నాయని, ఈక్రమంలోనే తరచూ రోడ్డ ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. రాజీవ్ రహదారిపైకి వచ్చేక్రమంలో అక్కడి మూలమలుపుతో తరచూ ప్రమాదాలో చోటుచేసుకుని వాహనదారుల ప్రాణాలు పోతున్నాయని మండిపడ్డారు. అయితే, హెచ్‌ఆర్ కార్యాలయానికి వస్తే గ్రామస్తుల సమక్షంలో చర్చించి ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకుంటారని ఎన్టీపీసీ భద్రతా సిబ్బంది హామీ ఇవ్వడంతో యువకులు శాంతించారు.
రోడ్డు ప్రమాదంలో సింగరేణి ఉద్యోగి దుర్మరణం